- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో భారీ ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. భద్రతా దళాలే లక్ష్యంగా అక్కడి సింధ్ రేంజర్స్ ప్రధాన కార్యాలయం (Headquarters) పై ఒక సూసైడ్ స్క్వాడ్ ఒక్కసారిగా విరుచుకుపడింది. అత్యంత భద్రత ఉండే ఈ ప్రాంతంలో జరిగిన దారుణమైన ఆత్మహుతి పేలుడు కారణంగా ఇప్పటివరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భీకర దాడిలో మరికొందరు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బాధ్యత వహించిన జమాత్-ఉల్-అహ్రార్
ఈ ఘోర ఉగ్రవాద దాడి తామే చేసినట్లు నిషేధిత ఉగ్రవాద సంస్థ 'తెహ్రిక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్' (TTP) అనుబంధ విభాగానికి చెందిన జమాత్-ఉల్-అహ్రార్ అధికారికంగా ప్రకటించింది. పాకిస్తాన్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఈ సంస్థ గతంలోనూ పలుమార్లు ఇటువంటి దాడులకు పాల్పడింది. ఈ దాడితో కరాచీ నగరంలో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
కరాచీలో హై అలర్ట్
ఈ ఘోర ఘటనపై పాకిస్తాన్ ఉన్నతాధికారులు, భద్రతా సంస్థలు తీవ్రంగా స్పందించాయి. పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సైనిక, పోలీస్ బలగాలు ఈ ఉగ్రదాడిపై దర్యాప్తును ప్రారంభించాయి. కంట్రోల్ రూమ్, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఉగ్రవాదులు లోపలికి ఎలా ప్రవేశించారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కరాచీ నగరంలో హై అలర్ట్స్ ప్రకటించడమే కాకుండా భద్రతా ఏర్పాట్లను అధికారులు మరింత కఠినతరం చేశారు.






