బస్సు టైర్ కింద పడి మూడేళ్ల చిన్నారి దుర్మరణం

by Batti.Sumithra |

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది.

బస్సు టైర్ కింద పడి మూడేళ్ల చిన్నారి దుర్మరణం
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ నుంచి వస్తున్న తన అన్నను చూసేందుకు ఆనందంతో పరుగెత్తిన మూడేళ్ల చిన్నారి స్కూల్ బస్సు టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వడపర్తి గ్రామానికి చెందిన చేవర్తి శ్రీనివాస్–లతశ్రీ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మోక్షిత్ స్థానిక శ్రీ రామానుజన్ పాఠశాలలో మొదటి తరగతి చదువుతున్నాడు.

ప్రతిరోజులాగే శనివారం స్కూల్ బస్సు విద్యార్థులను గ్రామంలో దింపుతుండగా, ఇంటి వద్ద ఆడుకుంటున్న రియాన్స్ (3) తన అన్న బస్సు నుంచి దిగడాన్ని గమనించి అతని వద్దకు పరుగెత్తాడు. అయితే ఈ క్రమంలో తల్లి పెద్ద కుమారుడిని తీసుకుని ఇంట్లోకి వెళ్లగా, చిన్నారి బస్సు సమీపంలోనే ఉన్నాడు. అదే సమయంలో డ్రైవర్ గమనించకుండా బస్సును ముందుకు తీసుకెళ్లడంతో చిన్నారి ప్రమాదవశాత్తు టైర్ కింద పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న భువనగిరి రూరల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్ కుమార్ తెలిపారు.

Next Story