కోర్టు తీర్పులు, ప్రభుత్వ రికార్డులను కూడా లెక్కచేయడం లేదు.. కన్నీటి పర్యంతమైన వృద్ధురాలు

by Kodari Anjali |

కోర్టు తీర్పుల్ని లెక్కచేయకుండా స్వంత డబ్బులతో కొనుగోలు చేసిన భూమిని దున్నడమే కాకుండా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని, అధికారులు న్యాయం చేయాలని ఓ వృద్ధురాలు వేడుకుంది.

కోర్టు తీర్పులు, ప్రభుత్వ రికార్డులను కూడా లెక్కచేయడం లేదు.. కన్నీటి పర్యంతమైన వృద్ధురాలు
X

దిశ, శాయంపేట: నా భర్త చనిపోయినప్పటి నుంచి నన్ను టార్గెట్ చేశారు. కోర్టు తీర్పు ఉన్నా, ప్రభుత్వ పట్టాదారు పాస్‌బుక్ ఉన్నా లెక్కచేయడం లేదు.. నేను సాగు చేస్తున్న భూమిలోకి దౌర్జన్యంగా వచ్చి కొట్టారు. నన్ను కాపాడండి" అంటూ శాయంపేటకు చెందిన 60 ఏళ్ల మామిడి తిరుపతమ్మ శనివారం విలేకరుల సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. 2007లో చట్టబద్ధంగా భూమి కొనుగోలు చేసి, స్వంత ఖర్చుతో సాగుభూమిగా మార్చుకుని 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నానని ఆమె తెలిపారు. అనంతరం అదే భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేసి వివాదానికి తెరలేపారని, ఆ వ్యవహారంపై పరకాల కోర్టు తీర్పు, లోక్ అదాలత్ ఉత్తర్వులు, ప్రభుత్వ పట్టాదారు పాస్‌బుక్ తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ కుసుమ సందీప్ కుటుంబం వాటిని గౌరవించడం లేదని ఆరోపించారు.

న్యాయం చేయాలని బాధితురాలు వేడుకోలు

ప్రస్తుతం హనుమకొండ జిల్లా కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే జూన్ 11న ఐదుగురు వ్యక్తులతో కలిసి తన భూమిలోకి ట్రాక్టర్‌తో ప్రవేశించి దున్నేశారని, అడ్డుకున్న తనపై దాడి చేసి చంపేస్తామని బెదిరించారని ఆమె ఆరోపించారు. తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని, అయినప్పటికీ పోలీసులపైనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తహసీల్దార్ విచారణలో కూడా రికార్డుల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించి సర్వే చేయాలని నివేదిక ఇచ్చారని పేర్కొన్న తిరుపతమ్మ, అయినా వేధింపులు ఆగడం లేదని వాపోయారు. తన వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలు, కోర్టు ఉత్తర్వులు, పట్టాదారు పాస్‌బుక్, రెవెన్యూ నివేదికలను మీడియా ఎదుట ప్రదర్శిస్తూ, "నాకు ప్రాణహాని ఉంది... అధికారులు, న్యాయవ్యవస్థ న్యాయం చేయాలి" అని వేడుకున్నారు.

Next Story