ఆ విషయంపై ఎట్టకేలకు మౌనం వీడిన తరుణ్ భాస్కర్.. చర్చనీయాంశంగా మారిన ఇన్‌స్టా పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-22 04:20:08  IST  )

టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) సీక్వెల్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు చేదు వార్త అని చెప్పాలి.

ఆ విషయంపై ఎట్టకేలకు మౌనం వీడిన తరుణ్ భాస్కర్.. చర్చనీయాంశంగా మారిన ఇన్‌స్టా పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) సీక్వెల్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు చేదు వార్త అని చెప్పాలి. ఈ సినిమా నుంచి సాయి సుశాంత్ రెండవ పార్ట్ నుంచి తప్పుకున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, దర్శకుడు తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) ఓ పోస్ట్ ద్వారా వైరల్ అవుతున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సీక్వెల్‌లో కార్తీక్ పాత్రలో నటించిన సాయి సుశాంత్ రెడ్డి (Sai Sushanth Reddy)వ్యక్తిగత కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం లేదని తరుణ్ స్పష్టం చేశారు. ఈ విషయం తనను ఎంతో బాధించిందని, ఒకానొక దశలో అసలు ఈ సినిమానే ఆపేద్దామా అని ఆలోచించానని అన్నారు.

అయితే, ఈ కథ తన నిజ జీవిత స్నేహాల నుండి పుట్టిందని, అందుకే ఆ ప్రాజెక్ట్‌ను కాపాడటం కోసం స్క్రిప్ట్‌ను మళ్ళీ విశ్లేషించుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ సినిమా కేవలం డబ్బు కోసం చేస్తున్నది కాదని, సరైన సమయంలో కథ తన దగ్గరకు ఆర్గానిక్‌గా వచ్చిందని తరుణ్ వివరించారు. సుశాంత్ ఈ ప్రయాణంలో లేకపోయినా, కథలో అత్యంత కీలకమైన ‘కార్తీక్’ పాత్ర మాత్రం ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. సుశాంత్ స్థానంలో కొత్త నటుడు ఈ పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది. మళ్ళీ అదే ప్రపంచాన్ని, అదే పాత్రలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నానని, ‘ENE 2’ (ENE Repeat) ఒక స్నేహితుడు ఇచ్చే వెచ్చని కౌగిలింతలా ఉంటుందని తరుణ్ భరోసా ఇచ్చారు.

తన నటీనటులు, సాంకేతిక నిపుణులపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ‘ద బాయ్స్’ మళ్ళీ తిరిగి వస్తున్నారని తరుణ్ భాస్కర్ తన పోస్ట్‌లో పేర్కొనడంతో సోషల్ మీడియాలో ఈ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌పై నెట్టింట చర్చమొదలైంది. కాగా.. ఈ సినిమా ‘ENE Repeat’ అనే టైటిల్‌తో పట్టాలెక్కబోతోంది. “ఏలినాటి శని అయిపోయింది.. కన్యారాశి టైమ్ వచ్చింది” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రానుంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మళ్ళీ సందడి చేయనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Read More..

బిగ్ షాకిచ్చిన ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్.. అస్సలు ఊహించలేదంటూ నెటిజన్ల కామెంట్స్

Next Story