ప్రశాంత్ కిషోర్ పార్టీకి సుప్రీం షాక్.. బీహార్ ఎన్నికల రద్దుకు నో చెప్పిన కోర్టు!

by Malleboina Mahesh |   (  Updated:2026-02-06 08:47:43  IST  )

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రద్దు చేయాలంటూ జన సూరజ్ పార్టీ దాఖలు పిటిషన్ చేసింది. ఈ పిటిషన్‌ను విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించి ప్రశాంత్ కిషోర్‌కు ఉహించని షాక్ ఇచ్చింది.

ప్రశాంత్ కిషోర్ పార్టీకి సుప్రీం షాక్.. బీహార్ ఎన్నికల రద్దుకు నో చెప్పిన కోర్టు!
X

దిశ, వెబ్‌డెస్క: గత సంవత్సరం జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ Prashant Kishore() సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రద్దు చేయాలంటూ జన సూరజ్ పార్టీ దాఖలు పిటిషన్ చేసింది. ఈ పిటిషన్‌ను విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించి ప్రశాంత్ కిషోర్‌కు ఉహించని షాక్ ఇచ్చింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందన్న వాదనతో దాఖలైన ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం, రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయస్థానాలను వేదికగా చేసుకోవద్దని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఎన్నికలకు ముందు అధికార ప్రభుత్వం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (MCC) తుంగలో తొక్కిందని జన్ సురాజ్ పార్టీ తన పిటిషన్‌లో ప్రధానంగా ఆరోపించింది. అప్పుల్లో ఉన్న రాష్ట్రం, ఓటర్లను ఆకర్షించేందుకు 'ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన' కింద సుమారు రూ. 15,600 కోట్లను పంపిణీ చేసిందని, ఇది ఇతర రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు లేకుండా చేసిందని వాదించింది. ఈ భారీ పంపిణీ ద్వారా లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతిన్నందున, మొత్తం ఎన్నికల ప్రక్రియనే చెల్లనిదిగా ప్రకటించాలని పీకే పార్టీ తన పిటిషన్‌లో కోరింది.

కాగా ఈ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ (Chief Justice Surya Kant), జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ (Justice Joy Mallya Bagchi)లతో కూడిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. "మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి? ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిన తర్వాత, ఉపశమనం కోసం న్యాయస్థానాలను వాడుకుంటారా!" అని సిజెఐ ప్రశ్నించారు. ఒకవేళ ప్రభుత్వ పథకం పై అభ్యంతరం ఉంటే అప్పుడే సవాలు చేసి ఉండాల్సిందని, కానీ ఇప్పుడు మొత్తం రాష్ట్ర ఎన్నికలను రద్దు (Abolition of election) చేయాలని కోరడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. కేవలం ప్రాచుర్యం కోసమే ఇటువంటి పిటిషన్లు వేస్తున్నారని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసి.. పీకే పిటిషన్ ను కొట్టివేసింది.

ఈ వివాదం కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించినది కాబట్టి, దీనిపై పట్నా హైకోర్టు (Patna High Court)ను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాఖలు చేసిన ఒక ఉమ్మడి ఎన్నికల పిటిషన్ లాగా ఉందని పేర్కొంటూ, ప్రస్తుతానికి ఈ పిటిషన్‌ను విచారించలేమని స్పష్టం చేసింది. అయితే, ఉచితాల (Freebies) అంశంపై ఉన్న తీవ్రమైన అభ్యంతరాలను తాము వేరుగా పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పుతో ఎన్నికల ఫలితాల తర్వాత న్యాయపోరాటం ద్వారా ఫలితాన్ని మార్చాలనుకున్న జన్ సూరజ్ పార్టీ ప్రయత్నాలకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది.

బెంగాల్‌లో కాంగ్రెస్ ఒంటరి పోరు.. మొత్తం 294 స్థానాల్లో పోటీ

Next Story