డిప్యూటీ సీఎంతో మంత్రులు భేటీ కాకూడదా.. భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-27 09:35:22  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వేళ సోమవారం రాత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ భేటీ అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

డిప్యూటీ సీఎంతో మంత్రులు భేటీ కాకూడదా.. భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వేళ సోమవారం రాత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ భేటీ అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు సింగరేణి టెండర్ల వ్యవహారం, మరోవైపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే క్రమంలో ఈ సమావేశం పార్టీ వర్గాల్లో, పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే ఆ సమావేశంపై వస్తున్న వార్తలపై తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) స్పందించారు.

ఉమ్మడి కుటుంబంగా పని చేస్తున్నాం..

ఇవాళ ఖమ్మం పర్యటనలో ఉన్న ఆయన, ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. తనతో మంత్రులు భేటీ అవ్వడం సాధారణ విషయమేనని, అయినా సమావేశం కాకూడదా? అని ప్రశ్నించారు. పాలనాపరమైన అంశాలపైనే అప్పుడప్పుడు అలా భేటీ అవుతుంటామని క్లారిటీ ఇచ్చారు. మంత్రులు సీఎం లేదా డిప్యూటీ సీఎం వద్దకు వెళ్తుంటారని.. సీఎం అందుబాటులో లేరు కాబట్టే తనతో ఆయా విషయాలపై చర్చించేందుకు వచ్చారని అన్నారు. తాను, సీఎం, మంత్రులు అంతా సమష్టిగా, ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు.‘ఎవరో పిచ్చోళ్లు ఏదో మాట్లాడుతుంటారు.. అన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు.

సింగరేణిలో అవినీతి కట్టుకథ..

సింగరేణి (Singareni)లో అసలు అవినీతి జరగలేదని, అవన్నీ ప్రధాన ప్రతిపక్షం అల్లుతున్న కట్టుకథలని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం పంచాయతీలను బీఆర్ఎస్ గెలుచుకుందని ప్రశ్నించగా.. ఆ స్టేట్‌మెంట్ తప్పు అని ఆయన కొట్టిపారేశారు. చరిత్రలో ఏ పార్టీ సాధించనన్ని పంచాయతీలను కాంగ్రెస్ (Congress) పార్టీ కైవసం చేసుకుందని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అంతకంటే పెద్ద విజయమే సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తమపై ఎవరు ఎలాంటి దుష్ప్రచారం చేసినా.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే తమ ధ్యేయమని అన్నారు. తెలంగాణను 2047 కల్లా 3 ట్రిలియన్ ఎకానమీగా నిలిపేందుకు ఎలా ముందుకు వెళ్లాలన్నదే తమ ఆలోచన అని, ఇతర ఆలోచనలు తమకు లేవని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

READ MORE .....

తెలంగాణ వచ్చిన తొలి పదేళ్లలో సమస్యలు తీరలే.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

Next Story