యూనస్ ప్రభుత్వాన్ని కూలదోయండి.. బంగ్లాదేశ్ ప్రజలకు షేక్ హసీనా పిలుపు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-24 04:30:28  IST  )

బంగ్లాదేశ్ ఎన్నికల వేళ ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రజలకు సంచలన పిలుపునిచ్చారు.

యూనస్ ప్రభుత్వాన్ని కూలదోయండి.. బంగ్లాదేశ్ ప్రజలకు షేక్ హసీనా పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ ఎన్నికల వేళ ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రజలకు సంచలన పిలుపునిచ్చారు. ఆగస్టు 2024లో చెలరేగిన హింసాత్మక నిరసనల తర్వాత భారతదేశంలో తలదాచుకుంటున్న హసీనా శనివారం ఆడియో సందేశం ద్వారా.. బంగ్లాదేశ్ ప్రస్తుతం "భీభత్స యుగం"లోకి ప్రవేశించిందని, దేశాన్ని కాపాడుకోవడానికి మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని "తోలుబొమ్మ ప్రభుత్వాన్ని" కూలదోయాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.

మరణాల లోయగా మారిన దేశం

బంగ్లాదేశ్ ప్రస్తుతం మొహమ్మద్ యూనస్ ప్రభుత్వంలో వినాశకర స్థితిలో ఉందని, ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న దేశం ఇప్పుడు "మరణాల లోయ"గా మారిందని హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. "హంతక ఫాసిస్ట్ యూనస్" తన స్వార్థం కోసం దేశ భూభాగాలను, వనరులను విదేశీ శక్తులకు ధారాదత్తం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రజాస్వామ్యం బహిష్కరణకు గురైందని, మానవ హక్కులు మంటగలిశాయని, మైనారిటీలు, మహిళలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు. ముఖ్యంగా అవామీ లీగ్ పార్టీ కార్యకలాపాల పై నిషేధం విధించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.

పరిస్థితిని చక్కదిద్దడానికి ఐదు సూత్రాలు

బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12, 2026న జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హసీనా ఐదు కీలక డిమాండ్లను ముందుకు తెచ్చారు. అక్రమ యూనస్ పాలనను అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, వీధి హింసను అరికట్టడం, మైనారిటీలకు భద్రత కల్పించడం, రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఆపడం, గత ఏడాది జరిగిన పరిణామాలపై ఐక్యరాజ్యసమితి (UN) చేత నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. యూనస్ నీడ తొలగే వరకు దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు సాధ్యం కావని ఈ సందర్భంగా షేక్ హసీనా తన సందేశంలో స్పష్టం చేశారు.

Read More..

రిపబ్లిక్‌ డే ముందు ఉగ్ర కుట్ర భగ్నం.. 2.5 కిలోల ఆర్డీఎక్స్‌ స్వాధీనం

Next Story