రిపబ్లిక్‌ డే ముందు ఉగ్ర కుట్ర భగ్నం.. 2.5 కిలోల ఆర్డీఎక్స్‌ స్వాధీనం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-24 04:29:12  IST  )

పంజాబ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు భారీ ఉగ్రవాద కుట్రను పోలీసులు భగ్నం చేశారు.

రిపబ్లిక్‌ డే ముందు ఉగ్ర కుట్ర భగ్నం.. 2.5 కిలోల ఆర్డీఎక్స్‌ స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు భారీ ఉగ్రవాద కుట్రను పోలీసులు భగ్నం చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ జలంధర్‌తో కలిసి పంజాబ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నిషేధిత ఉగ్రసంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI)కి చెందిన ఒక టెర్రర్ మాడ్యూల్‌ను గుర్తించి నలుగురిని అరెస్ట్ చేశారు. హోషియార్‌పూర్ జిల్లా గర్హ్‌శంకర్ ప్రాంతానికి చెందిన దిల్జోత్ సింగ్ సైనీ, హర్మన్ అలియాస్ హ్యారీ, అజయ్ అలియాస్ మెహ్రా, అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష్ కండోలా అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

పంజాబ్ డీజీపీ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుల వద్ద నుంచి 2.5 కిలోల RDXతో తయారు చేసిన ఒక ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ (IED), రెండు పిస్టళ్లు, వాటికి సంబంధించిన కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉగ్ర మాడ్యూల్‌ను అమెరికాలో ఉన్న BKI హ్యాండ్లర్లు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. రికవర్ చేసిన IEDను గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా లక్ష్యంగా చేసుకున్న ఉగ్రదాడికి ఉపయోగించాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై గర్హ్‌శంకర్ పోలీస్ స్టేషన్‌లో UAPA (అన్‌లాఫుల్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) ఎక్స్‌ప్లోసివ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా పంజాబ్ డీజీపీ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో స్పందిస్తూ.. “పాకిస్థాన్ ISI మద్దతుతో నడిచే ఉగ్ర నెట్‌వర్క్‌పై భారీ విజయం సాధించాం. కౌంటర్ ఇంటెలిజెన్స్ జలంధర్‌తో కలిసి హోషియార్‌పూర్ పోలీసులు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందిన ఉగ్ర మాడ్యూల్‌ను ఛేదించారు. నాలుగు మంది ఉగ్రవాదుల నుంచి 2.5 కిలోల RDXతో కూడిన IEDతో పాటు రెండు పిస్టళ్లు, కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు” అని తెలిపారు. అలాగే.. “ఈ మాడ్యూల్‌ను అమెరికాలో ఉన్న BKI హ్యాండ్లర్లు నడుపుతున్నారు. రికవర్ చేసిన IEDను గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి వినియోగించాలని ప్లాన్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది” అని డీజీపీ పేర్కొన్నారు.

Read More..

గణతంత్ర వేడుకల్లో ‘ఎస్-400’ శకటం.. ఆపరేషన్ సిందూర్ గుర్తుచేస్తూ..

Next Story