మహిళల విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత : ఎమ్మెల్యే యెన్నం

by Batti.Sumithra |

మహిళల విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

మహిళల విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత : ఎమ్మెల్యే యెన్నం
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహిళల విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్ధినుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 25 లక్షల టీయూఎఫ్‌ఐడీసీ నిధుల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళాశాలలో నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ స్థాపనకు చర్యలు తీసుకుంటున్నామని, బీఎస్సీ కంప్యూటర్స్‌తో పాటు ఇతర కోర్సుల విద్యార్థులు కూడా కంప్యూటర్ పరిజ్ఞానం పొందేందుకు సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు.

అదనంగా టాస్క్ సెంటర్ ద్వారా విద్యార్థులు వివిధ భాషలు నేర్చుకునే అవకాశాలు కల్పిస్తున్నామని, స్వల్పకాలిక శిక్షణా కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాబోయే పోలీస్ నియామకాల నేపథ్యంలో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు సిద్ధం కావాలని విద్యార్థులను ప్రోత్సహించిన ఎమ్మెల్యే, ఎన్‌సీసీ విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌ పై దృష్టి పెట్టి రోజువారీ సాధన చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి కళాశాల గ్రంథాలయ అభివృద్ధికి తన సొంత నిధుల నుండి 50 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే సమక్షంలో అందజేసి, ప్రతి సంవత్సరం 50 వేల రూపాయల సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డి, వి.మహేందర్, ఇంచార్జీ ప్రిన్సిపాల్ అమీనా ముంతాజ్, కార్పొరేటర్లు ఉమర్ కొత్వాల్, ఫయాజ్, అవేజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story