రైతుల పరిరక్షణకు దక్షిణాది రాష్ట్రాలు సంఘటితం కావాలి: మంత్రి తుమ్మల

by Ajay Maddhiboyina |   (  Updated:2026-07-18 16:01:43  IST  )

ఆయిల్ పామ్ రైతులకు స్థిరమైన ఆదాయం లభించేలా కేంద్ర ప్రభుత్వం విధానపరమైన జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

రైతుల పరిరక్షణకు దక్షిణాది రాష్ట్రాలు సంఘటితం కావాలి: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆయిల్ పామ్ రైతులకు స్థిరమైన ఆదాయం లభించేలా కేంద్ర ప్రభుత్వం విధానపరమైన జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం దక్షిణాది రాష్ట్రాల తరఫున ప్రధాని మోడీకి లేఖ రాశారు. దేశంలో 6.50 లక్షల హెక్టార్ల ఆయిల్ పామ్ సాగు లక్ష్యంలో ఇప్పటికే 2.73 లక్షల హెక్టార్లలో సాగు విస్తరించగా, అందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 2.05 లక్షల హెక్టార్లు ఉందని తన లేఖలో పేర్కొన్నారు. దేశంలో వంటనూనెల స్వయం సమృద్ధి సాధనలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.

ఆయిల్ పామ్ పంట దిగుబడులు రావడానికి 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుందని, రైతులు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందన్నారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ గెలల ధరలు అంతర్జాతీయ క్రూడ్ పామ్ ఆయిల్ ధరలు, దిగుమతి సుంకాలపై ఆధారపడి ఉండటంతో రైతుల్లో ఆందోళన ఏర్పడిందన్నారు. దిగుమతి సుంకాల్లో తరచూ మార్పులు చేయడంతో రైతులకు లభించే ధరలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని వివరించారు.

2018లో 44 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 2022 నాటికి పూర్తిగా తగ్గించడం, అనంతరం 2024లో 27.5 శాతానికి చేయడంతో రైతులకు కొంత ఊరట లభించినప్పటికీ, 2025 మే 31 నుంచి మళ్లీ 27.5 నుండి 16.5 శాతానికి తగ్గించడంతో దేశీయ మార్కెట్ ధరలు పడిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు క్రూడ్ పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని మళ్లీ 44 శాతానికి పునరుద్ధరించాలని కోరారు. వీలు కాకుంటే ఆయిల్ పామ్ గెలల మెట్రిక్ టన్నుకు కనీస హామీ ధర రూ.25 వేలుగా నిర్ణయించి, సాగు వ్యయం, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని కాలానుగుణంగా సవరించే విధానం చేయాలని సూచించారు.

Next Story