- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
West Bengal: అక్రమంగా కట్టడమంటూ అభిషేక్ బెనర్జీ ఎంపీ ఆఫీసు కూల్చేసిన బెంగాల్ ప్రభుత్వం
అభిషేక్ బెనర్జీకి చెందిన కార్యాలయాన్ని అక్రమ కట్టడమంటూ అధికారులు బుల్డోజర్లతో కూల్చివేయడం శనివారం పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది.

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో దశాబ్దాల టీఎంసీ పాలన ముగిసి బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా, దక్షిణ 24 పరగణాల జిల్లా అమ్తాలాలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీకి చెందిన కార్యాలయాన్ని అక్రమ కట్టడమంటూ అధికారులు బుల్డోజర్లతో కూల్చివేయడం శనివారం పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఈ భవనానికి నోటీసులు అంటించిన వెంటనే యంత్రాంగం కూల్చివేత పనులు ప్రారంభించింది. ఈ పరిణామంతో అమ్తాలా రోడ్డు పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించారు. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) రికార్డుల ఆధారంగా అభిషేక్ కుటుంబం, వారి 'లీప్స్ అండ్ బౌండ్స్' సంస్థ పేరిట ఉన్న 17 ఆస్తులకు కూల్చివేత నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ చర్య చోటుచేసుకుంది. ఈ హిట్ లిస్ట్‌లో హరీష్ ముఖర్జీ రోడ్డులోని ఆయన సొంత నివాసం 'శాంతినికేతన్' కూడా ఉండటం గమనార్హం.
కోల్‌కతా మున్సిపల్ రికార్డుల నుండి సేకరించిన సమాచారం అంటూ.. అభిషేక్ బెనర్జీ, ఆయన అనుచరులకు చెందిన 43 ఆస్తుల జాబితాను బీజేపీ బయటపెట్టడంతో ఈ వివాదం మొదలైంది. అయితే, ఈ వాదనలను టీఎంసీ రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలే కొట్టిపారేస్తూ, డేటాబేస్‌లో అభిషేక్ బెనర్జీ అనే పేరుతో చాలామంది ఉంటారని, అవన్నీ తమ నేతవే అనడం సరికాదని తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపు చర్యేనని, కేవలం మున్సిపల్ రికార్డులలో పేరును బట్టి కావాలనే తమ పార్టీ అగ్రనేతను లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమ కూల్చివేతకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, నిబంధనల ప్రకారమే ఈ చర్యలు చేపట్టామని అధికారులు స్పష్టం చేస్తుండటంతో, బెంగాల్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య బుల్డోజర్ రాజకీయం మరింత ముదిరి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.






