అసైన్డ్ ల్యాండ్‌లో మాజీ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్.. అనుమతులపై ఆరా తీయగా బయటపడ్డ సంచలన నిజాలు!?

by Jakkula.Mamatha |   (  Updated:2026-03-20 06:22:26  IST  )

డ్రగ్స్​‍ కేసులో ఇరుక్కున్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు.

అసైన్డ్ ల్యాండ్‌లో మాజీ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్.. అనుమతులపై ఆరా తీయగా బయటపడ్డ సంచలన నిజాలు!?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో /మొయినాబాద్‌: డ్రగ్స్​‍ కేసులో ఇరుక్కున్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అజీజ్‌ నగర్‌ ఉన్న రోహిత్‌ రెడ్డి ఫామ్‌ హౌజ్‌‌ను అసైన్డ్ ల్యాండ్‌‌లో నిర్మించినట్లు రెవెన్యూ శాఖ తాజాగా గుర్తించింది. సర్వే నెంబర్‌ 177/33లో 3.39 గుంటల భూమిని గతంలో ప్రభుత్వం అంతంగారి జంగయ్య అనే రైతుకు అసైన్‌ చేసింది. ప్రస్తుతం భూ భారతిలో కూడా ఆ భూమి జంగయ్య పేరు మీదనే ఉంది. ఇదే స్థలంలో ఫామ్‌ హౌజ్‌‌ను నిర్మించగా.. పైలెట్‌ రోహిత్‌ రెడ్డి తండ్రి విఠల్‌ రెడ్డి పేరుతో ఫామ్‌ హౌస్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. 2022 సంవత్సరంలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో, తాజాగా డ్రగ్స్​‍ పార్టీతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ ఫాం హౌస్ అనుమతులపై ఆరా తీయగా విస్తుగొలిపే అంశాలు బయట పడ్డాయి.

అసైన్డ్ ల్యాండ్‌‌లోనే ఫామ్‌ హౌస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అసైన్డ్ ల్యాండ్‌ రోహిత్‌ రెడ్డి చేతికి ఎలా వెళ్లిందన్న దానిపై అధికారులు కూపీ లాగుతున్నారు. సర్వే నిర్వహించి పూర్తి ఆధారాలు సేకరించాక ఫాం హౌస్ ను సీజ్‌ చేసేందుకు రెవిన్యూ, పోలీసు అధికారులు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఫాం హౌస్ నిర్మాణం అసైన్డ్ ల్యాండ్‌ లోనే ఉన్నదని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు మొయినాబాద్‌ తహసీల్దార్‌ గౌతమ్‌ కుమార్‌ తెలిపారు. అయితే ఇప్పటికే డ్రగ్స్​‍ కేసులో పీకల దాకా కూరుకు పోయిన రోహిత్‌ రెడ్డికి అసైన్డ్ భూమి వివాదం మరింత ఇబ్బందిగా పరిణమించనున్నది.

కస్టడీ పిటిషన్‌ తీర్పు వాయిదా..

డ్రగ్స్​‍ పార్టీలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌తోపాటు మొత్తం 11 మంది పాల్గొన్నారు. పైలెట్‌, మహేష్‌‌తో పాటు మరో నలుగురికి డ్రగ్స్​‍ పాజిటీవ్‌‌గా వచ్చింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం సిట్‌ ను ఏర్పాటు చేసి డ్రగ్స్​‍ గుట్టు విప్పే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే రోహిత్‌ రెడ్డి, రితేష్‌ రెడ్డి, నమిత్‌ శర్మ లు జైల్లో ఉండటంతో వారి కస్టడీని కోరుతూ పోలీసులు ఉప్పరిపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ ను పరిశీలించిన న్యాయమూర్తి తీర్పును సోమవారానికి వాయిదా వేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురు తిరువీధుల అర్జున్‌ రెడ్డి, కౌశిక్‌ రవి, సిలివేరు శరత్‌ కుమార్‌, నల్లపనేని విజయ కృష్ణ, మొరవినేని రమేష్‌, వరమాచినేని శ్రవణ్‌ కుమార్‌, ఆర్‌.ప్రియాంక రెడ్డిలు స్టేషన్‌ బెయిల్‌ పై బయట ఉన్నారు. వీరందరినీ వేర్వేరుగా పోలీసులు విచారణ చేస్తున్నారు. స్టేషన్‌ బెయిల్‌ పొందిన ఎంపీ పుట్టా మహేష్‌‌ను పార్లమెంట్‌ సమావేశాల తర్వాత విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ కేసు.. తీర్పును సోమవారానికి వాయిదా వేసిన కోర్టు

Next Story