రైతుల భూములు లాక్కుంటే సుప్రీంకోర్టు వరకు పోరాటం: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

by Taduka Kalyani |

పేద రైతుల భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తే సుప్రీంకోర్టు వరకు పోరాటం చేస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.

రైతుల భూములు లాక్కుంటే సుప్రీంకోర్టు వరకు పోరాటం: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, బెజ్జూర్: పేద రైతుల భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తే సుప్రీంకోర్టు వరకు పోరాటం చేస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. 50 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను అటవీ అధికారులు అడ్డుకుంటే సహించబోమని స్పష్టం చేశారు. ఆదివారం సిర్పూర్ (టి) మండలంలోని డోర్‌పల్లి, కొమ్ముగూడ గ్రామాల్లో రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అటవీ అధికారులు సాగును అడ్డుకుంటున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వం జారీ చేసిన పట్టా పాస్‌పుస్తకాలు ఉన్నప్పటికీ రైతులను సాగు చేయనివ్వకపోవడం దారుణమన్నారు. వ్యవసాయం చేయడం, జీవనోపాధి పొందడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉందని పేర్కొన్నారు. గ్రామంలో సుమారు 4 వేల ఎకరాల రెవెన్యూ భూమి ఉందని రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారులు నిర్ధారించినప్పటికీ అటవీ శాఖ జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. రైతులను ఇదే విధంగా వేధిస్తే అటవీ అధికారులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. సిర్పూర్ రెవెన్యూ అధికారులు, రాష్ట్ర, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. భూముల సమస్య పరిష్కారం అయ్యే వరకు గ్రామ రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొంగ సత్యనారాయణ, గోలెం వెంకటేశం, నక్క మనోహర్, మాజీ ఎంపీపీ మాలతి, మహిళా నాయకులు లలిత, మమత, సిర్పూర్ మండల కన్వీనర్ అస్లాం, మానేపల్లి మండల నాయకుడు లహెంచుతో పాటు పలువురు పాల్గొన్నారు.

Next Story