- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి సంతకం లేనిదే పని జరగట్లేదు.. నిధుల కోసం ఎమ్మెల్యేల ఆవేదన!
నియోజకవర్గ అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించాలని తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్, భట్టి విక్రమార్కలను కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో : 2026–27 బడ్జెట్‌లో కానిస్టెన్సీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (సీడీపీ) కింద ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు ఇవ్వాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న ఎస్డీఎఫ్ (స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్) సరిపోవట్లేదని, పనులు చేపట్టడానికి మంత్రుల అనుమతిపై ఆధారపడాల్సిన దుస్థితి ఉందని వాపోతున్నారు. దీంతో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లిన సమయంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించలేక పోతున్నావా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.
నిధుల కేటాయింపులో స్వేచ్ఛ కోసం..
నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో వివిధ సమస్యలపై ఎమ్మెల్యేలకు వినతులు వస్తుంటాయి. అందులో తక్కువ నిధులతో వెంటనే పరిష్కారమయ్యే పనులు కూడా ఉంటాయి. దీని కోసం ప్రతి బడ్జెట్‌లో (కానిస్టెన్సీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్) కింద నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తుంటారు. 2025-26 బడ్జెట్‌లో సైతం ప్రతి సెగ్మెంట్‌కు రూ.5 కోట్లు కేటాయించారు. కానీ ఆ నిధులు రిలీజ్ చేయడంలో ఆలస్యమవుతుండటంతో ఎమ్మెల్యేలు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్‌పై ఫోకస్ పెట్టారు. ఆ నిధులు పూర్తిగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి చేతుల్లో ఉంటాయి.
ఎమ్మెల్యేల సిఫార్సులపై సంబంధిత మంత్రి సంతకం చేస్తేనే.. ఆ నిధులు రిలీజ్ అవుతాయి. దీంతో ప్రతి పనికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి చుట్టూ తిరగాల్సి వస్తున్నదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సీడీపీ కింద నిధులు కేటాయిస్తే తమ చేతుల్లో కొంత పవర్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ‘ప్రతి పనికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వద్దకు వెళ్లి ఫైల్ క్లియర్ చేయించుకోవడం మంచిగా అనిపించడం లేదని.. గ్రామాలకు వెళ్ళినప్పుడు వినతులు వచ్చిన వెంటనే నిధులు ఇస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటిస్తే మా గౌరవం పెరుగుతుంది’ అని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వివరించారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.






