- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌లో టీపీసీసీ చిచ్చు: కోమటిరెడ్డి vs అనిల్.. బీసీ కార్డుతో ముదిరిన వివాదం!
జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్ చేయాలన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీసీ నేత అనిల్ ధ్వజమెత్తుతుండగా, తన మాటలను వక్రీకరించారని మంత్రి వివరణ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీపీసీసీ చీఫ్చేస్తే వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర ఖనిజావృద్ది సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్.. మంత్రి వెంకట్ రెడ్డి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు బీసీ సామాజిక వర్గానికి చెందిన టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వాన్ని కించపరచడమేనని, ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నిస్తూ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్న వేళ, సొంత పార్టీ నేతలపై వెంకటరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని అభ్యంతరం వ్యక్తం చేశారు.
సమర్థవంతంగా పనిచేస్తున్న ఒక బీసీ నేతను పక్కన పెట్టి, మరొకరికి పదవి ఇవ్వాలని డిమాండ్ చేయడం ద్వారా మీరు పార్టీలో చీలికలు తేవాలని చూస్తున్నారా? అంటూ నిలదీశారు. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ సమర్థవంతమైన పర్యవేక్షణలో పార్టీ తిరుగులేని విజయాలను నమోదు చేస్తోందని, క్షేత్రస్థాయిలో పార్టీ ఇంత బలంగా ఉంటే మహేష్ గౌడ్ నాయకత్వాన్ని తక్కువ చేయడం అంటే అవమానించడమేనని, బీసీల పట్ల అంత కక్ష ఎందుకు? అంటూ ఫైర్ అయ్యారు.
ఓర్వలేకపోతున్నారు
‘గతంలో నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పొన్న కైలాష్ నేతని నియమిస్తే.. ఆనాడు ఆ పదవి ఆయనకు రాకుండా అడ్డుకోవాలని చూసింది మీరు కాదా వెంకటరెడ్డి? నాడు జిల్లా స్థాయిలో ఒక బీసీ నేత ఎదుగుతుంటే అడ్డుపడ్డారు. నేడు రాష్ట్ర స్థాయిలో మహేష్ గౌడ్‌కి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నారు. బీసీలంటే మీకెందుకు అంత చులకన? గతంలో వైఎస్, డీఎస్ హాయాంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మహేష్ గౌడ్ హయాంలో ఎందుకు సాధ్యం కాదు? మీ వైఖరి మార్చుకోండి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. పార్టీలో గందరగోళం సృష్టించేలా, బీసీ నేతలను కించపరిచేలా మాట్లాడటం మానుకోవాలి’ అంటూ వెంకట్ రెడ్డికి అనిల్ హితవు పలికారు.
ఇది కొందరి కుట్ర
జగ్గారెడ్డిని టీపీసీసీ చీఫ్చేయాలని తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌పై తాను ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని, కొందరు ఉద్దేశపూర్వకంగానే తన మాటలను వక్రీకరించి, తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. మహేష్ కుమార్ గౌడ్‌ను తొలగించాలనే ఆలోచన, ఉద్దేశం తనకు లేదన్నారు. ఆయన తనకు ఎన్ఎస్‌యూఐ నుంచి మంచి స్నేహితుడని, ఆయన నాయకత్వంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ క్లీన్ స్వీప్ చేసిందని వెంకట్ రెడ్డి తెలిపారు.
సంగారెడ్డి లో జరిగిన రంజాన్ వేడుకల్లో జగ్గారెడ్డి ఆర్గనైజింగ్ స్కిల్స్ చూసి ముగ్ధుడనయ్యానని, ఆ సందర్భంలోనే భవిష్యత్తులో జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయితే బాగుంటుందని, ఆయనకు ఒక ప్రశంస గానే అన్నట్లుగా చెప్పానని మంత్రి వివరించారు. తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని, కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు సృష్టించేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.






