ఫోన్ ట్యాపింగ్ కేసు.. త్వరలో ఆరుగురు హరీష్ రావు అనుచరులకు నోటీసులు..!

by Malleboina Mahesh |   (  Updated:2026-01-21 03:52:33  IST  )

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణ కీలక మలుపులు తిరుగుతోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. త్వరలో ఆరుగురు హరీష్ రావు అనుచరులకు నోటీసులు..!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) విచారణ అనంతరం దర్యాప్తును అధికారులు మరింత వేగవంతం చేశారు. ప్రణీత్ రావు బృందం హరీష్ రావుతో పాటు ఆయన ప్రధాన అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. దీనిపై మరింత స్పష్టత కోసం త్వరలోనే హరీష్ రావుకు చెందిన ఆరుగురు ముఖ్య అనుచరుల (followers)కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలవాలని సిట్ అధికారులు నిర్ణయించారు.

పోలీసుల కథనం ప్రకారం.. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని నెలల పాటు హరీష్ రావు ఫోన్ (Harish Rao's phone) నిరంతరాయంగా ట్యాప్ చేయబడింది. ఏయే తేదీల్లో, ఏయే సమయాల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే వివరాలను సిట్ అధికారులు ఆధారాలతో సహా హరీష్ రావుకు వివరించారు. ప్రణీత్ రావు టీం ప్రత్యేకంగా హరీష్ రావు కదలికలపై నిఘా ఉంచినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఆధారాలను చూసిన హరీష్ రావు విచారణ సమయంలో ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం.

విచారణ సందర్భంగా పోలీసులు సంధించిన ప్రశ్నల పట్ల హరీష్ రావు విభిన్నంగా స్పందించారు. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నను ఆయన ఒక పేపర్ మీద రాసుకున్నారు. విచారణ జరుగుతున్న తీరుపై స్పందిస్తూ, "ఈ ప్రశ్నలు, ఆధారాలు మీరే సృష్టించారా?" అని పోలీసులను నేరుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులు సాంకేతిక ఆధారాలను ముందుంచడంతో విచారణ ఆసక్తికరంగా సాగింది. ఈ కేసులో మరిన్ని రాజకీయ కోణాలు బయటపడే అవకాశం ఉండటంతో సిట్ తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Read More..

హరీష్ రావును మళ్లీ విచారిస్తాం: CP సజ్జనార్

Next Story