ఫోన్ ట్యాపింగ్ కేసు ‘మనసు-మమత’ సీరియల్: మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-23 07:12:42  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసు ‘మనసు-మమత’ సీరియల్: మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్/జూబ్లీహిల్స్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) పేరుతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. నాటి తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో రేవంత్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం పని చేశామని, ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదన్నారు. అధికారంలో ఉన్న నాడు ప్రతిపక్షాలను వేధించలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ధ్వజమెత్తారు.

వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు..

రెండేళ్లుగా ప్రభుత్వం వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని ఆరోపణలు చేశారని, హీరోయిన్స్‌తో నాకు లింకులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా జరుగుతున్న వ్యక్తిత్వ హననానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. ఆరోపణలు చేస్తారు, ఆ తర్వాత అందులో నిజం లేదంటారని అన్నారు. మాకు బురద అంటించేందుకు విచారణ పేరిట వేధిస్తున్నారని, రాజకీయ నేతలంతా దొంగలు అనుకునేలా చేశారని ప్రభుత్వాన్ని విమర్శించారు. సింగరేణిలో కుంభకోణాన్ని హరీశ్ రావు బయటపెట్టగానే ఆయనకు నోటీసులు ఇచ్చారని అన్నారు. విచారణలో భాగంగా హరీశ్ సంధించిన ప్రశ్నలకు సిట్ సమాధానం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ ‘మనసు-మమత’ సీరియల్‌లా మారిందని సెటైర్లు వేశారు. పుట్టిన మట్టి సాక్షిగా.. అంతరాత్మ సాక్షిగా తాను ఎప్పుడూ అక్రమ, అనైతిక పనులకు పాల్పడలేదని అన్నారు. ప్రభుత్వంలోని దోపిడీని బయటపెడితే మమ్మల్ని వేధిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్..

ఫోన్ ట్యాపింగ్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌కు ముందు చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ లేదు, అంతా డొల్ల అని కామెంట్ చేశారు. విచారణకు పదిసార్లు పిలిచినా హాజరవుతానని, ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానన్నారు. చట్టంపై తమకు పూర్తి నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. విచారణ పేరుతో రేవంత్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి స్వయంగా తన సొంత మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఒకప్పుడు రూ.50 లక్షలతో ‘నోటుకు ఓటు’ కేసులో అడ్డంగా దొరికిన దొంగ ఇవాళ సీఎం కావడమే రాష్ట్ర దౌర్భాగ్యమని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు టెండర్లలో జరుగుతున్న అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను నయవంచన చేసిన సీఎంను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామని, ఆ పార్టీని బొంద పెట్టే వరకు విశ్రమించబోమని కేటీఆర్ అన్నారు.

Read More..

కాసేపట్లో సిట్ విచారణ.. తెలంగాణ భవన్‌కు బయల్దేరిన KTR, హరీశ్‌రావు

Next Story