డ్రగ్స్ కేసులో ప్రజాప్రతినిధులు.. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు

by Muthe.Rajitha |   (  Updated:2026-03-15 15:02:50  IST  )

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ప్రజాప్రతినిధులు పట్టుబడటంపై సామాన్య ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

డ్రగ్స్ కేసులో ప్రజాప్రతినిధులు.. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌లో ఒక మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపుతోంది. పోలీసుల నిఘా విభాగం మరియు ఈగల్ బృందం నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో సుమారు 2 గ్రాముల కొకైన్ పట్టుబడటమే కాకుండా, పార్టీ జరుగుతున్న సమయంలో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రాథమిక విచారణలో భాగంగా నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ కాగా, అందులో తెలంగాణ, ఏపీకి చెందిన కీలక రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఉండటం సామాన్యులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. బెంగళూరుకు చెందిన డ్రగ్ పెడ్లర్ కౌశిక్ రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న లోతైన మూలాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా నిందితుడు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సన్నిహితుడని ఒప్పుకోవడంతో, ఈ కేసు చుట్టూ ఉన్న రాజకీయ ఉచ్చు మరింత బిగుస్తోంది.

ప్రజాప్రతినిధుల నైతికతపై ప్రశ్నలు

ఈ కేసులో, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపించడం రాజకీయ రణరంగాన్ని వేడెక్కించింది. మహేష్ కు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ వచ్చిందన్న వార్తలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వంటి నేతలు రంగంలోకి దిగి, తక్షణమే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తెలంగాణలో గులాబీ పార్టీ అగ్రనేతలపై సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులుగా ఉంటూ ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన వారే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వంటి నాయకులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, పార్టీలకు అతీతంగా అందరూ ప్రజాప్రతినిధులు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని సవాలు విసురుతున్నారు. యువతను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తిస్తున్న నాయకులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

దర్యాప్తు గోప్యత.. ప్రజల ఆగ్రహం

మొయినాబాద్ ఘటన కేవలం ఒక నేరపూరిత ఉదంతంగానే కాకుండా, సమాజంపై, ముఖ్యంగా యువతపై పడే ప్రభావం పట్ల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తమను నడిపించాల్సిన నాయకులే మత్తు పదార్థాలకు బానిసలైతే, దేశ భవిష్యత్తు ఏమవుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు పోలీసులు అరెస్టయిన వారి పూర్తి వివరాలను, ఫొటోలను అధికారికంగా బయటపెట్టకపోవడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య పౌరుల విషయంలో చురుగ్గా వ్యవహరించే చట్టం, రాజకీయ ప్రముఖుల విషయంలో ఎందుకు వెనకాడుతోందని పౌర సమాజం నిలదీస్తోంది. రాజకీయ కక్షసాధింపు చర్యలని కొందరు ఆరోపిస్తున్నప్పటికీ, సిసిటివి ఫుటేజీ, ఈగల్ టీమ్ ఫలితాలు ఈ కేసులో కీలక ఆధారాలుగా మారనున్నాయి. ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అని తెలుగు ప్రజలు ఉత్కంఠగా గమనిస్తున్నారు.

ఎవ్వరిని వదలొద్దు.. డ్రగ్స్ కేసుపై రఘునందన్ రావు సీరియస్ కామెంట్స్

Next Story