రైతులకు అండగా ఉంటాం

by Taduka Kalyani |

బిఆర్ఎస్ పార్టీ బహదూర్‌గూడ రైతులకు అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడొద్దని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

రైతులకు అండగా ఉంటాం
X

దిశ, శంషాబాద్: బిఆర్ఎస్ పార్టీ బహదూర్‌గూడ రైతులకు అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడొద్దని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బహదూర్‌గూడలో రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి కార్తీక్ రెడ్డితో కలిసి రైతులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలను తెలియజేసి కన్నీటి పర్యంతమయ్యారు. సబితా ఇంద్రారెడ్డి వారికి ధైర్యం చెప్పారు. రైతుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని భరోసా కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బహదూర్‌గూడ భూములపై సర్వే నిర్వహించి, రైతుల భూమి ఎంత, ప్రభుత్వ భూమి ఎంత అనే అంశాలను నిర్ధారించామని తెలిపారు. రైతులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా, అధికారులు అది సాధ్యం కాదని తెలిపారని చెప్పారు. అనంతరం తాను మరో నియోజకవర్గానికి వెళ్లడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదన్నారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని, బహదూర్‌గూడ రైతులకు పట్టాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులతో వ్యవహరించిన తీరు సరికాదన్నారు. వారికి న్యాయపరమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story