'కమిటీ కుర్రాళ్లు': ఏ ఓటీటీ కొనలేదు.. విడుదలకు ముందే నెగటివ్ టాక్.. షాకింగ్ నిజాలు చెప్పిన దర్శకుడు

by Pulgam srinivas |

'కమిటీ కుర్రాళ్లు' సినిమాను ఏ ఓటీటీ సంస్థ కూడా కొనుగోలు చేయలేదని ఆ చిత్ర దర్శకుడు యదు వంశీ చెప్పుకొచ్చారు.

కమిటీ కుర్రాళ్లు: ఏ ఓటీటీ కొనలేదు.. విడుదలకు ముందే నెగటివ్ టాక్.. షాకింగ్ నిజాలు చెప్పిన దర్శకుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 'కమిటీ కుర్రాళ్లు' చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా, అలాగే ఉత్తమ మేకప్ విభాగంలో జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా దర్శకుడు యదు వంశీ సినిమా విడుదలకు ముందు ఎదురైన ప్రతికూల పరిస్థితుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. యదు వంశీ మాట్లాడుతూ.. ఈ సినిమాకు రెండు జాతీయ అవార్డులు రావడం ఎంతో ఆనందంగా ఉంది. మా సినిమా నిర్మాత నిహారిక గారి గట్టి పట్టుదల వల్లే ఈరోజు ఈ చిత్రానికి ఇంత గొప్ప ప్రశంసలు దక్కుతున్నాయి.

ఆమె నన్ను ఎందుకు నమ్మిందో నాకే తెలియదు. కానీ నన్ను పూర్తిగా నమ్మారు. ఈ సినిమాకు దాదాపు రూ.9 కోట్ల బడ్జెట్ అయ్యింది. అయినప్పటికీ ఏ ఓటీటీ సంస్థ కూడా మా సినిమాను కొనుగోలు చేయలేదు. ఈ విషయం చాలామందికి తెలియదు. అలాగే విడుదలకు ముందు నెగెటివ్ టాక్ కూడా వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ సినిమాను కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. దాదాపు 10 నిమిషాలు కట్ చేయాలని కూడా సూచించారు. కానీ నిహారిక గారు మాత్రం అస్సలు వెనక్కు తగ్గలేదు. ఎంతో ధైర్యంగా నిలబడ్డారు. చివరికి సినిమా విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు జాతీయ అవార్డులు కూడా దక్కాయి. ఇలా జరగడానికి ప్రధాన కారణం నిహారిక గారే అని చెప్పుకొచ్చారు.

Next Story