పార్లమెంట్ వర్షాకాల సమావేశాల హీట్.. రాజ్యసభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-20 05:30:30  IST  )

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా ప్రారంభంకానున్నాయి.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల హీట్.. రాజ్యసభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు సరిగ్గా ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే, సమావేశాల ప్రారంభానికి ముందు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మీడియాతో మాట్లాడుతారు. ఈ సందర్భంగా సభ సజావుగా సాగేందుకు అన్ని పక్షాలు సహకరించాలని ప్రధాని కోరే అవకాశం ఉంది. ఇక లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా దివంగత సభ్యులకు సంతాపం తెలిపే తీర్మానం ప్రవేశపెట్టి సభ సతాపం తెలుపనుంది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటలకు వరకు ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. ఆ తర్వాత ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కమిటీపై తీర్మానాన్ని ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender), అజయ్ భట్ ప్రవేశపెట్టనున్నారు.

అయితే, వర్షాకాల సమావేశాల తొలిరోజే కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. సుప్రీంకోర్టు (Supreme Court)లో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించేందుకు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కు పెంచుతూ రూపొందించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. వందేమాతరం గేయానికి జాతీయ గీతం హోదా కల్పిస్తూ ‘జాతీయ గౌరవానికి అవమానాల నివారణ చట్ట సవరణ’ బిల్లును రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు.

వ్యూహాలతో మాటల యుద్ధానికి విపక్షాలు రెడీ..

మరోవైపు పలు ప్రజా సమస్యలు, వివాదాస్పద అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET), సీబీఎస్‌ఈ (CBSE) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాలపై ఉభయసభల్లో సమగ్ర చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టనున్నాయి. అదేవిధంగా, అయోధ్యలో విరాళాల చోరీ అంశం కూడా పార్లమెంటును తీవ్రంగా కుదిపేసే అవకాశం కనిపిస్తోంది. అయోధ్య విరాళాల వ్యవహారాలపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. అదేవిధంగా లోక్‌సభలో చామల కిరణ్ కుమార్ రెడ్డి నీట్ అక్రమాలు, ప్రశ్నాపత్రం లీక్‌ అంశంపై చర్చించాలని నోటీసులు అందజేశారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పేర్కొన్నారు. పలు కీలక బిల్లులు, విపక్షాల వాయిదా తీర్మానాలతో వర్షాకాల సమావేశాల తొలిరోజే పార్లమెంట్ హీటెక్కనుంది.

ఇరాన్ - అమెరికా యుద్ధం.. భారత ఎంబసీ ఎమెర్జెన్సీ అడ్వైజరీ

Next Story