- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమతులు నిల్... ఏర్పాట్లు ఫుల్..!
వైరా–మధిర ప్రధాన రహదారి పక్కన ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు కోసం ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు చేపడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, వైరా : ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని మధిర రోడ్డులో వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదురుగా, వైరా–మధిర ప్రధాన రహదారి పక్కన ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు కోసం ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు చేపడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ అనుమతులు లేకుండానే మూడు అంతస్తుల భవనంలో పాఠశాల ఏర్పాటుకు ఏర్పాట్లు జరగడంతో పాటు, భవనం ముందు పాఠశాల బోర్డు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. స్థానికుల కథనం ప్రకారం, ఈ భవనానికి 100 మీటర్లలోపు దూరంలో వైన్ షాప్ ఉన్నప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండానే బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
గతంలోనూ వివాదమే..
వైరాలోని పాత కూరగాయల మార్కెట్ రోడ్డులో నిర్వహిస్తున్న విజ్ఞాన్ స్కూల్ను మధిర రోడ్డులోని కొత్త భవనానికి తరలించేందుకు గత ఏప్రిల్‌లో ఏర్పాట్లు ప్రారంభించినట్లు సమాచారం. ఈ అంశంపై అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగగా, దానిపై వార్తలు వెలువడడంతో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) చైతన్య జైన్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
తప్పుడు నివేదిక ఇచ్చారనే ఆరోపణలు..
వైన్ షాప్‌కు భవనం 100 మీటర్లలోపే ఉన్నప్పటికీ, అప్పటి వైరా ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు డీఈఓకు సమర్పించిన నివేదికలో భవనం 125 మీటర్ల దూరంలో ఉందని పేర్కొన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. భవనానికి ప్రధాన గేటు మధిర ప్రధాన రహదారి వైపే ఉండగా, మరోవైపు ప్రతిపాదిత 20 అడుగుల రహదారిని ప్రధాన ప్రవేశ ద్వారంగా చూపించడం కూడా అనుమానాలకు తావిస్తోందని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రతిపాదిత రహదారి ద్వారా స్కూల్ బస్సులు రాకపోకలు సాగించే పరిస్థితి లేదని, అయినప్పటికీ దానినే ప్రధాన ప్రవేశంగా చూపించడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అలాగే భవనం ముందు "విజ్ఞాన్ స్కూల్ – ఐఐటీ ఫౌండేషన్" పేరుతో బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు గోడలపై ప్రచార రచనలు కూడా చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
అనుమతి ఇవ్వలేదంటున్న ఎంఈఓ..
ఈ విషయంపై వైరా మండల విద్యాధికారి (ఎంఈఓ) చావా శ్రీనివాసరావును వివరణ కోరగా, మధిర రోడ్డులో ఆ భవనంలో పాఠశాల నిర్వహించేందుకు విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండానే భవనం ముందు బోర్డు ఏర్పాటు చేయడం, గోడలపై ప్రచార రచనలు చేసిన విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు. స్థానికులు మాత్రం జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్న పాఠశాలపై సమగ్ర విచారణ జరిపి, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






