- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీడ్ మాఫియా దోపిడీ.. తేమ పేరుతో బ్లాక్ మెయిల్
హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా సీడ్ వరి ధాన్యం పండించిన రైతాంగాన్ని సీడ్ వ్యాపారులు నిలువునా ముంచుతున్నారు. '

దిశ,హుజూరాబాద్ రూరల్: ఒప్పందాల పేరుతో పచ్చి మోసం.. నియమ నిబంధనల ఉల్లంఘన.. అధికారుల అండదండలతో అడ్డగోలు దోపిడీ.. హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా సీడ్ వరి ధాన్యం పండించిన రైతాంగాన్ని సీడ్ వ్యాపారులు నిలువునా ముంచుతున్నారు. 'సీడ్ టు సీడ్' ఒప్పందాన్ని తుంగలో తొక్కి వందల కోట్ల రూపాయల లాభాలను దండుకుంటూ, అన్నదాతను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు.
ఒప్పంద పత్రాలు కాగితాలకే పరిమితం..
2025 నవంబర్‌లో సాగు ప్రారంభానికి ముందు కంపెనీలు, వ్యాపారులు రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సన్న రకాలకు క్వింటాకు రూ.2,550, దొడ్డు రకాలకు రూ.2,450 మద్దతు ధర ఇవ్వాల్సి ఉంది. తీరా కోతలు ముగిసి పంట చేతికొచ్చిన కొనుగోలు చేసే సమయంలో (11-05-2026 నాటి అగ్రిమెంట్ పేపర్లను సృష్టించి) దొడ్డు రకంపై 80, సన్న రకంపై 50 చొప్పున అక్రమంగా ధరలు తగ్గించి రైతుల పొట్ట కొడుతున్నారు.
తేమ శాతం పేరుతో బ్లాక్‌మెయిల్..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యంలో 17 శాతం వరకు తేమ ఉండవచ్చు. కానీ, వ్యాపారులు మాత్రం మొండికేస్తూ 13-14 శాతం ఉంటేనే కొంటామని రైతులను బ్లాక్‌మెయిల్ చేశారు. దీనివల్ల రైతులు క్వింటాకు 3 నుంచి 4 కిలోల బరువును(తాలు, తరుగు పేరిట) నష్టపోవాల్సి వస్తోంది. ఎకరాకు 75 నుంచి 100 బస్తాల దిగుబడి లెక్కన చూస్తే.. ఈ తేమ శాతం నిబంధన వల్ల ప్రతి ఎకరాకు రైతులు వేల రూపాయల ఆర్థిక లాభాన్ని కోల్పోతున్నారు. ధాన్యం సేకరించిన తర్వాత కూడా రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించకుండా, నెలల తరబడి తిప్పుకుంటూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారు.
డబుల్ గేమ్ - ప్రభుత్వానికి లేవి అక్రమ దందా..
విత్తన వ్యాపారుల దోపిడీ ఇక్కడితో ఆగడం లేదు. రైతుల దగ్గర సీడ్ పేరుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని కేవలం సీడ్‌కే కాకుండా అక్రమ మార్గాల్లో ప్రభుత్వానికి 'లేవి' కింద అమ్ముకుంటున్నారు. ఒకవైపు రైతును ముంచుతూ, మరోవైపు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ వ్యాపారులు వందల కోట్ల లాభాలు గడిస్తున్నారు.
రూ.800 కోట్ల మేర మెగా స్కామ్..
ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే సుమారు 20,000 ఎకరాల్లో సీడ్ వరి సాగు జరుగుతోంది. ఈ ప్రాంతానికి చెందిన రైతులే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, మెదక్,పెద్దపల్లి, నిజామాబాద్, జిల్లాల్లోని వేలాది మంది రైతులు ఈ దోపిడీకి బలవుతున్నారు. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా సీడ్స్ మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏకపక్ష నిర్ణయాలు, వ్యాపారుల సిండికేట్ (రింగింగ్) వల్ల రైతాంగానికి సుమారు రూ.700 వందల నుంచి రూ. 800 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లిందని అంచనా.
'మామూళ్ల' మత్తులో వ్యవసాయ అధికారులు..
ఇంత పెద్ద ఎత్తున బహిరంగంగా పగటి దోపిడీ జరుగుతున్న.. జాయింట్ కలెక్టర్, జేడీఏ, ఏడీఏ వంటి ఉన్నతాధికారులు కనీసం తనిఖీలు కూడా చేయకపోవడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విత్తన కంపెనీలు అగ్రిమెంట్ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక 'భారీగా మామూళ్లు' అందాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీ గదులకే పరిమితమైన అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తే ఈ కుంభకోణం అసలు రంగు బయటపడుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సర్కారు స్పందించకుంటే ఉద్యమం తప్పదు రైతాంగం హెచ్చరిక..
పెట్టుబడులు రెట్టింపై, అకాల వర్షాలతో ఇప్పటికే నష్టపోయిన తమను ఈ విత్తన మాఫియా భారి నుంచి రక్షించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.అక్రమంగా తగ్గించిన ధరలను తక్షణమే పునరుద్ధరించాలి. తరుగు, తేమ పేరుతో చేస్తున్న దోపిడీని అరికట్టాలి. విత్తన మాఫియాకు సహకరిస్తున్న అధికారులపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున పరిహారం అందించాలి. లేదంటే కలెక్టరేట్ల ముట్టడితో పాటు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం అని రైతులు హెచ్చరిస్తున్నారు.
సీడ్ ప్రొడ్యూసర్స్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి
2025 నవంబర్‌లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా, పంట చేతికొచ్చాక 2026 మే నెలలో సీడ్ ప్లాంట్ యజమానులు కొత్త ఒప్పందం పేరుతో ధరలు తగ్గించి రైతులను మోసం చేస్తున్నారు.తరుగు, తూకం, సంచి బరువు పేరుతో ప్రతి బస్తా పై 2.5 కిలోల చొప్పున కోతలు విధిస్తూ రైతులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారు. రైతులను నిలువునా ముంచుతున్న సీడ్ ప్రొడ్యూసర్స్ ,ప్లాంట్ల యజమానులపై నాన్-బెయిలబుల్, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయకపోతే, సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి హెచ్చరించారు.






