కాలుష్య కాటు!

by Jakkula.Mamatha |

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని రసాయన కంపెనీల కాలుష్యం స్థానిక ప్రజల జీవితాలను నరకప్రాయంగా మారుస్తోంది.

కాలుష్య కాటు!
X

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని రసాయన కంపెనీల కాలుష్యం స్థానిక ప్రజల జీవితాలను నరకప్రాయంగా మారుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో వదులుతున్న విషవాయువుల వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు శ్వాస తీసుకోలేక అల్లాడిపోతున్నారు. భద్రతా లోపాల కారణంగా దోతిగూడెం పరిశ్రమల్లో ఆరు నెలల వ్యవధిలోనే ఇద్దరు కెమిస్ట్‌లు రియాక్టర్లు పేలి దుర్మరణం పాలయ్యారు. రసాయన వ్యర్థాలను భూమిలోకి వదులుతుండడంతో భూగర్భ జలాలు విషపూరితమై, పచ్చని పంట భూములు బంజరుగా మారుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వందలాది సార్లు ప్రజలు, కార్మిక సంఘాలు ధర్నాలు చేసినా జిల్లా యంత్రాంగం, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కాలుష్య కారక కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వాటిని తక్షణమే మూసివేయకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పారిశ్రామిక ప్రాంతంలో రసాయన కంపెనీలు గుప్పిస్తున్న విషవాయువులు, వదులుతున్న రసాయన జలాలు స్థానిక ప్రజల జీవితాలను నరకప్రాయంగా మార్చుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతున్నా సంబంధిత జిల్లా అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) మాత్రం ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరించడం పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజల ఆరోగ్యం క్షీణిస్తున్నా అక్కడి పచ్చని భూములు వినాశనానికి గురవుతున్నా అధికారులు దీనిని ఒక సాధారణ విషయంగా వదిలేయడం ఇక్కడి పాలనా వ్యవస్థ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది.

ఊపిరి ఆగిపోతున్నా వీడని నిర్లక్ష్యం..

దోతిగూడెం రసాయన పరిశ్రమల నుంచి ముఖ్యంగా రాత్రివేళల్లో వెలువడుతున్న దట్టమైన పొగ, దుర్వాసనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకో లేక అల్లాడిపోతున్నారు. ఇక్కడి కంపెనీలలో భద్రతా లోపాల కారణంగా ఆరు నెలల వ్యవధిలోనే రియాక్టర్లు పేలి ఇద్దరు కెమిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 21న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దారా పవన్, జూలై 16న అనంతపురం జిల్లాకు చెందిన అలమూరు కృష్ణారెడ్డి ఈ ప్రమాదాలకు బలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడంలో కాలుష్య నియంత్రణ మండలి పూర్తిగా విఫలమైంది. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం, తనిఖీల పేరుతో డ్రామాలు ఆడటం, ఆ తర్వాత విషయం సద్దుమణిగేలా చేయడం అధికారులకు అలవాటుగా మారిందని స్థానికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటని?, వారికి ప్రజల ప్రాణాల కంటే యాజమాన్యాల ప్రయోజనాలే ముఖ్యమా? అని ప్రశ్నిస్తున్నారు.

భూములు నిస్సారం.. జలాలు విషపూరితం..

పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను, కలుషిత నీటిని కనీసం ట్రీట్‌మెంట్ చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా భూమిలోకి వదులుతుండడంతో చుట్టుపక్కల వ్యవసాయ భూములు పూర్తిగా నిస్సారంగా మారుతున్నాయి. ఒకప్పుడు పచ్చని పంటలతో విలసిల్లిన పొలాలు, నేడు రసాయనాల ఘాటుకు బంజరు భూములుగా మారుతున్నాయని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. భూగర్భ జలాలు సైతం పూర్తిగా కలుషితం కావడంతో రంగు మారిన నీటిని తాగలేక, వాడలేక ప్రజలు, పశువులు తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు. చర్మ వ్యాధులు, శ్వాసకోశ ఇబ్బందులు ఇక్కడి గ్రామాల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. పంటలు, ప్రాణాలకు ఇంతటి నష్టం జరుగుతున్నా వ్యవసాయ, భూగర్భ జల వనరుల శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది మిస్టరీగా మారింది.

కాగితాలకే పరిమితమవుతున్న విచారణలు..

ఇంతటి దారుణమైన వినాశనం కళ్లముందు కనిపిస్తున్నా ప్రజలు, కార్మిక సంఘాలు వందలాది సార్లు రోడ్లెక్కి ధర్నాలు చేసినా జిల్లా యంత్రాంగంలో చలనం రావడం లేదు. విచారణలన్నీ కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేయడం, ఆ తర్వాత సదరు కంపెనీలు నిబంధనలు పాటిస్తున్నాయా? లేదా? అని పర్యవేక్షించే నాథుడే కరువయ్యాడు. కాగితాలపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం వల్లే యాజమాన్యాలకు భయం లేకుండా పోయింది.

శాశ్వత పరిష్కారం ఎప్పుడు..?

ఇప్పటికైనా జిల్లా అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు స్పందించి ఏళ్ల తరబడి సాగుతున్న ఈ నిర్లక్ష్యానికి చరమగీతం పాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోచంపల్లి మండల ప్రజల ఆరోగ్యాలు, భూములను కాపాడేందుకు సదరు కాలుష్య కారక రసాయన కంపెనీలను శాశ్వతంగా మూసివేయడమో? లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించడమో చేయాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రజా ఆగ్రహానికి అధికారులు, పాలకులు బలికాక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Next Story