చెరువును తలపిస్తున్న రోడ్డు.. ఏండ్లు గడిచినా తీరని సమస్య.. పరిష్కారం ఎప్పుడో..?

by Batti.Sumithra |   (  Updated:2026-07-19 13:38:22  IST  )

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని కిష్టాపూర్ గ్రామం మామిల్లగూడెం వాడలో ఏళ్లుగా డ్రైనేజీ సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.

చెరువును తలపిస్తున్న రోడ్డు.. ఏండ్లు గడిచినా తీరని సమస్య.. పరిష్కారం ఎప్పుడో..?
X

దిశ, రెబ్బెన : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని కిష్టాపూర్ గ్రామం మామిల్లగూడెం వాడలో ఏళ్లుగా డ్రైనేజీ సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కాలనీలోని మొత్తం మురుగు, వర్షపు నీరు ఒకేచోట చేరి రోడ్డుపైనే నిల్వ ఉండడంతో రోడ్డు చెరువును తలపిస్తోంది. మామిల్లగూడెం వాడలోకి ప్రవేశించాలంటే ఈ మురుగు, వర్షపు నీటిని దాటుకుని వెళ్లడం తప్ప ప్రజలకు మరో మార్గం లేదు. ప్రజలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలను ఎదుర్కొంటూ ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ రహదారి పై ప్రయాణించడం కష్టంగా మారిందని వాపోతున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదని, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని కాలనీవాసులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో సంబంధిత అధికారులు స్పందించి, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు. నిల్వ నీటి కారణంగా దోమలు విపరీతంగా పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య అలాగే కొనసాగుతోందని, ఇప్పటికైనా స్పందించి ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మామిల్లగూడెం వాడ ప్రజల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు.

Next Story