- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొగడ్తలు కాదు.. పని కావాలి: పవన్ కల్యాణ్
ప్రభుత్వం చేయాలనుకున్న మంచిని ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించాల’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖల మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ‘ప్రజలు ఎన్నో ఆశలతో కూటమిని గెలిపించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా మేమంతా పని చేస్తున్నాం. ప్రతి అడుగులో ప్రజలకు మంచి చేయాలన్న తపనతో ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వం చేయాలనుకున్న మంచిని ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించాల’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖల మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖను ప్రభావవంతమైన శాఖగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం.. ప్రతి అడుగులో పాదర్శకత, జవాబుదారీతనంతో పని చేస్తున్నాం.. ఇందుకు ఉద్యోగులకు కూడా అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఉద్యోగులు కూడా అంతే చిత్తశుద్ధి, జవాబుదారీతనంతో పని చేయాలని ఆశిస్తున్నామన్నారు. అలసత్వం, అవినీతికి తావులేకుండా ప్రతి ఒక్కరూ పని చేయాలని నిర్దేశం చేశారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, ఇంజినీరింగ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0, అడవితల్లి బాట, జల్ జీవన్ మిషన్ తదితర విభాగాల్లో ఇప్పటి వరకు జరిగిన పనులపై ఆరా తీశారు. గత ఏడాది నిర్ధేశిత లక్ష్యాలను పూర్తి చేశారా? లేదా? పూర్తి చేయకపోతే కారణాలు ఏంటి? అనే అంశాలపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు.
రూ. 4 వేల కోట్లు దుర్వినియోగం
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో ప్రజలకు మంచి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తుంది. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. పంచాయతీల్లో స్వపరిపాలనకు చోటు లేకుండా చేసింది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా విచ్చలవిడితనంతో ఇష్టారాజ్యంగా నిధులు దారి మళ్లించింది. జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసింది. రూ. 4 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయి. లక్ష్యాలకు విరుద్ధంగా ముక్కలు ముక్కలుగా పైపులు వేసి వదిలేసింది. పనులు చేసినట్టు రికార్డులు చూపిస్తున్నాయిగాని, ఒక్క ఇంటికి కూడా నీరు ఇచ్చిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ, వ్యవస్థలను బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఐదేళ్ల పాలనలో ఎన్నో తప్పులు చేశారు. సోషల్ ఆడిట్ విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన వారిపై చర్యలు కూడా లేదు.
పొగడ్తలు కాదు.. పని కావాలి
నాకు చప్పట్లు, పొగడ్తలు అవసరం లేదు. పని మాత్రమే కావాలి. ఉన్నత స్థాయి అధికారి నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ వరకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలి. ఉపాధి హామీ, జల్ జీవన్ మిషన్ పనుల్లో నిర్లక్ష్యాన్ని, నిధుల దుర్వినియోగాన్ని సహించం. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలం అయినా, పని పట్ల నిర్లక్ష్యం వహించినా కఠినంగా వ్యవహరిస్తాం. సోషల్ ఆడిట్ కూడా మొక్కుబడిగా కాకుండా పక్కాగా జరగాలి. క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రతి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందాలి.
నా వైపు నుంచి ఎలాంటి రాజకీయ సిఫార్సులు రావు
నా వైపు నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడులు, సిఫార్సులు ఉండవు. ప్రతి అధికారి నిబంధనలకు లోబడి మాత్రమే పని చేయాలి. గత ప్రభుత్వంలో పని చేసిన కొంతమంది అధికారులు ఇప్పటికీ ఆ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తూ.. ప్రభుత్వ పాలసీల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. పనిలో అలసత్వాన్ని అస్సలు సహించం. ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకు మాత్రమే పని చేయాలి. పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేసేందుకు ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నాం. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా పూర్తి చేశాం. ఒకేసారి 10 వేల మందికి పదోన్నతులు కల్పించి మా చిత్తశుద్ధిని చాటుకున్నాం. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటున్నాం. ఉమ్మడి కడప జిల్లాలో ఓ ఎంపీడీవోపై దాడి జరిగితే వెంటనే స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చాం. మీ ప్రమోషన్ల సంతోషం.. ప్రజల్లోనూ కనబడాలి.
మద్దతు కూడగట్టి నిధులు సాధిస్తున్నాం
రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మేము ఎంతో కష్టపడుతున్నాం. కేంద్ర పెద్దల మద్దతు కూడగట్టి నిధులు సాధిస్తున్నాం. మా కష్టానికి సార్ధకత చేకూరేలా అధికారులు పని చేయాలి. ప్రజల సంక్షేమం, సంతోషం ధ్యేయంగా అంతా పని చేయాలి. ప్రజలకు మంచి చేయాలన్న కూటమి ప్రభుత్వ సంకల్పానికి మీరు తోడుగా నిలవాలి” అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.






