- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయివేట్ హోటల్‌లో పవన్ కల్యాణ్ సమావేశం.. పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయంటూ..
పారిశ్రామికవాడల్లో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ నిర్దేశించారు.

దిశ, వెబ్‌డెస్క్: ‘కాలుష్యం మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారిపోయింది. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కొంత వరకు కాలుష్యాన్ని భరించక తప్పని పరిస్థితి. అయితే కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో నివారించలేకపోయినా నిలువరించి నియంత్రించే ప్రయత్నం అయితే జరగాలి. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ నిర్దేశించారు. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తు.చ. తప్పక పాటిస్తూ జీవ వైవిధ్యానికి సహకరించాలని సూచించారు. నూతన సాంకేతికత సాయంతో వ్యర్థాల నిర్వహణ, గాలి నాణ్యత పెంపు తదితర చర్యలు తీసుకోవాలని తెలిపారు. శుక్రవారం సాయంత్రం విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్‌లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణం, కాలుష్య నియంత్రణ అంశంపై విశాఖ పరిసరాల్లోని పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. పోర్టు నుంచి పారిశ్రామికవాడల వరకు యాజమాన్యాలు కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
ఆందోళనకర పరిస్థితులు
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “ఉత్తరాంధ్ర తీర ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతే వేగంగా ఇక్కడ గాలి నాణ్యత తగ్గుతూ వచ్చింది. గడచిన రెండేళ్ల కాలంలో పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ పరవాడ పారిశ్రామికవాడ పరిధిలోని తాడి గ్రామం లాంటి చోట్ల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రసాయన పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం కారణంగా తాడి గ్రామంలో ఇంటికొకరు చొప్పున క్యాన్సర్ బారిన పడిన దుస్థితి. చిన్నారుల్లో చర్మ వ్యాధులు, మహిళల్లో గర్భస్రావాలు, ఊపిరితిత్తుల వ్యాధులు ఆ ప్రాంతంలో సర్వసాధారణం అయిపోయాయి. అలాగే విశాఖ పోర్టు కాలుష్యం కూడా పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యంపై దాడి చేస్తోంది. పోర్టు పరిసరాల్లో బొగ్గు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పోర్టు అథారిటీ పరిధిలోని గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. అక్కడ నివశించే ప్రజలు ఎన్నో సందర్భాల్లో వారి సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి ఘటనలపై మానవతా దృక్పథంతో స్పందించి బాధిత ప్రజలకు అండగా నిలవాలి.
పరిశ్రమలు నిబంధనలు పాటించవన్న భావన ఉంది
రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే పరిశ్రమలు రావాలి. అదే సమయంలో ఒక పరిశ్రమను స్థాపించాలి అంటే ఎన్నో సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవహారంలో నిబంధనలు సరిగా పాటించవన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. అన్ని రకాల కాలుష్యాలకు ఉత్తరాంధ్రను డంపింగ్ ప్రాంతం చేశారని ఆ ప్రాంత ప్రజలు వాపోతూ ఉంటారు. పరిశ్రమలు వచ్చిన ప్రతిసారి ప్రజల్లో నిర్లక్ష్యానికి గురవుతున్నామన్న భావన కూడా పెరిగిపోతోంది. పరిశ్రమల యాజమాన్యాలు సాటి మనుషుల పట్ల కనీస బాధ్యతతో స్పందించాల్సిన అవసరం ఉంది. పారిశ్రామికవాడల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు చేయగలిగినంత చేయాలి. ముఖ్యంగా ఆధునిక సాంకేతికతతో వ్యర్థాల నిర్వహణ చేపట్టి వారి జీవితాలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.
పర్యావరణ పరిరక్షణకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అందులో భాగంగానే 50 శాతం గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తోంది. ప్రతి పరిశ్రమ 33 శాతం గ్రీన్ బెల్ట్ నిబంధనను పాటించాలి. మొక్కుబడిగా తూతూ మంత్రం చర్యలు కాకుండా- జీవ వైవిధ్యాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది కోస్తా జిల్లాల పరిధిలో 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. తీరం మొత్తం 5 కిలోమీటర్ల వెడల్పున, మూడు బఫర్ జోన్లుగా విడగొట్టి మొక్కలతో గోడ నిర్మించేందుకు గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును తీసుకువచ్చాం. ఈ బృహత్తర ప్రణాళికలో మీరంతా భాగస్వాములు కావాలని కోరుతున్నాను. గ్రేట్ గ్రీన్ వాల్ తీర ప్రాంతానికి రక్షణ కల్పిస్తుంది. పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు కూడా ఈ మహా యజ్ఞంలో తమ వంతు ప్రాత్ర పోషించాలి. రాష్ట్ర అభివృద్ధిలో మీ మద్దతు అవసరం. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి” అన్నారు.






