- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ పుర పోరులో జనసేన గాలి వీస్తుందా?
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేయనుండటం పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఆయన తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారని ముందుగా అనుకున్నా.. ఆ తర్వాత అనివార్య కారణాలతో పర్యటన రద్దు చేసుకున్నట్టు స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన హవా ఎంతవరకు పని చేస్తుంది?, "ఇది బీజేపీ–జనసేన అలయన్స్‌కు బలం ఇస్తుందా?" అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ ఒక స్టార్ రాజకీయ నాయకుడు కావడం వల్ల కొంత మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఇప్పటికే కొంత బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఆ ప్రాంతాల్లో వోటర్లను ఆకర్షించి, పోలింగ్ శాతం పెరిగి అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఏపీలో జనసేన–టీడీపీ–బీజేపీ కూటమి విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరింత బలపడింది. ఈ ప్రభావం తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్రా సెటిలర్స్ మీద, యువతపై కొంత ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు. జనసేన పార్టీ తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన తర్వాత, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంలో మునిగిపోయారు. ఇది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో హీట్ పెంచిందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. బీజేపీతో అలయన్స్ వల్ల జనసేనకు ఆర్గనైజేషనల్ సపోర్ట్ లభిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వడానికి అంగీకరించారు. ఇది బీజేపీకి అదనపు స్టార్ పవర్‌గా మారవచ్చు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) లాంటి పట్టణ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్, ఫాలోయింగ్ యువతను, అర్బన్ మిడిల్ క్లాస్ ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉంది. మునిసిపల్ ఎన్నికల్లో ఈ వర్గాల ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉంది.
అయితే పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ పూర్తిగా పని చేస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. జనసేన పార్టీకి తెలంగాణలో ఇంకా బలమైన లోకల్ స్థాయి నిర్మాణం లేకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇటీవలే పార్టీ కమిటీల పునర్నిర్మాణం మొదలుపెట్టినా, అది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది. అయితే ఏపీలో పవన్ కళ్యాణ్ విజయం అక్కడి రాష్ట్ర ప్రత్యేక రాజకీయ పరిస్థితులు, స్థానిక సమస్యలపై ఆధారపడింది. అదే ఫార్ములా తెలంగాణలో పనిచేస్తుందా అనేది కూడా అనుమానమే. తెలంగాణ ఓటర్లు ఎక్కువగా స్థానిక సమస్యలు, అభివృద్ధి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల వంటి అంశాలపై దృష్టి పెడతారు. కేవలం పవన్ స్టార్ ఇమేజ్ తో ఓట్లు రాలకపోవచ్చు అనేది కూడా అక్షర సత్యం.
మరో సమస్య ఏమిటంటే, బీజేపీ–జనసేన అలయన్స్‌పై కొంతమంది బీజేపీ నేతల్లోనే స్పష్టత లేకపోవడం. ఈ కూటమి వల్ల ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ కు, బీఆర్‌ఎస్‌కు లాభం కలగవచ్చని కొందరు భావిస్తున్నారు. గతంలో బీజేపీ చేసిన కొన్ని అలయన్స్‌లు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. అంతేకాదు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సెంటిమెంటును తీసుకు రావడమే కాదు, ఇటీవల కోనసీమకు తెలంగాణ నేతలు దిష్టి పెట్టారనే పవన్ వ్యాఖ్యలను ఎత్తి చూపుతూ ఎదురుదాడికి దిగుతున్నారు. కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు తెలంగాణలో జనసేన పెద్దగా ప్రభావం చూపదని, కాంగ్రెస్‌కే ఆధిక్యం ఉంటుందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ప్రభావం కొంతవరకు మాత్రమే పని చేసే అవకాశముంది. ముఖ్యంగా బీజేపీకి బలమైన ప్రాంతాల్లో, యువతకు ఇది బూస్ట్ ఇవ్వవచ్చు. కానీ జనసేన పార్టీకి లోకల్ ప్రెజెన్స్ తక్కువగా ఉండటం, అలయన్స్‌లో అంతర్గత విభేదాలు, తెలంగాణ ఓటర్ల దృష్టి పూర్తిగా స్థానిక సమస్యలపై ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఇది జనసేనకు తెలంగాణలో తనను తాను పరీక్షించుకునే ఒక ప్రయోగంలా కనిపిస్తోంది.






