నగరంలో నకిలీ క్లినిక్స్ పై మెరుపు దాడులు.. శంకర్ దాదాలపై కేసులు

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్‌లోని అల్వాల్ పరిధిలో అర్హత లేని నకిలీ వైద్యులు, క్లినిక్‌లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) ఆదివారం మెరుపు దాడులు నిర్వహించింది.

నగరంలో నకిలీ క్లినిక్స్ పై మెరుపు దాడులు.. శంకర్ దాదాలపై కేసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని అల్వాల్ పరిధిలో అర్హత లేని నకిలీ వైద్యులు, క్లినిక్‌లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) ఆదివారం మెరుపు దాడులు నిర్వహించింది. కౌన్సిల్ సభ్యులు డా. గుండగాని శ్రీనివాస్, డా. ఇమ్రాన్‌లతో కూడిన బృందం అల్వాల్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఎలాంటి చట్టబద్ధ అనుమతులు, కనీస అర్హతలు లేకుండా విచ్చలవిడిగా ఆధునిక వైద్యం (అలోపతి) అందిస్తున్న నలుగురు నకిలీ వైద్యుల గుట్టు రట్టు చేశారు. ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తున్న సదరు కేంద్రాలపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు కౌన్సిల్ ప్రకటించింది.

దాడుల్లో దొరికిన క్లినిక్‌ల వివరాలు..

గోపు శ్రీనివాస్ అనే వ్యక్తి విదేశీ వైద్య విద్యార్థుల కోసం నిర్వహించే ఎఫ్ఎంజీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకుండానే.. చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా శంకర శశాంక క్లినిక్ పేరిట హాస్పిటల్ ఏర్పాటు చేసుకుని అలోపతి వైద్యం చేస్తున్నట్లు కౌన్సిల్ గుర్తించింది. జి. జానకి రాములు (శ్రీ సాయి పోలీ క్లినిక్) అనే ఫిజియోథెరపిస్ట్ తన పరిధిని మించి రోగులకు ఆధునిక వైద్య మందులను, ప్రిస్క్రిప్షన్లను జారీ చేస్తూ పట్టుబడ్డారు. సుదర్శన్ (కోమల్ క్లినిక్) అనే వ్యక్తి ఎలాంటి అర్హత పత్రాలు, అనుమతులు లేకుండానే వైద్య సేవలందిస్తున్నట్లు నిర్ధారించారు. క్రిస్టోఫర్ (శేభా క్లినిక్) అనే వ్యక్తి కనీస వైద్య అర్హతలు లేకుండానే అలోపతి ప్రాక్టీస్ చేస్తున్నట్లు కౌన్సిల్ బృందం గుర్తించింది.

ప్రాణాంతకంగా మారుతున్న చికిత్సలు..

ఈ అనధికార క్లినిక్‌లలో రోగులకు ఎలాంటి అవగాహన లేకుండా స్టెరాయిడ్లు, పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్ ఇంజెక్షన్లను విచక్షణారహితంగా ఇస్తున్నట్లు తనిఖీ బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి అసమర్థ, అక్రమ చికిత్సల వల్ల రోగుల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందని, యాంటీ-మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) పెరిగి ప్రాణాలకే ముప్పు వస్తుందని వైద్యులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వీరిపై ఎన్ఎంసీ, టీఎంపీఆర్ చట్టాల ప్రకారం కఠినమైన కేసులు నమోదు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు కేవలం తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో నమోదైన అర్హత కలిగిన నిజమైన వైద్యుల వద్దే చికిత్స చేయించుకోవాలని కౌన్సిల్ సూచించింది. నకిలీ డిగ్రీలతో మోసాలకు పాల్పడినా, అనధికారికంగా క్లినిక్‌లు నిర్వహించినా సహించేది లేదని హెచ్చరించింది. ప్రజలకు తమ పరిసరాల్లో నకిలీ వైద్యుల గురించి సమాచారం తెలిస్తే 9154382727 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కోరింది. రాష్ట్రవ్యాప్తంగా క్వాక్స్ (నకిలీ వైద్యుల)పై ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేసింది.

Next Story