సీతాఫల్‌మండిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై బీజేపీ ఆకస్మిక తనిఖీలు

by Kodari Anjali |

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా జరిగేలా చూడాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ పార్టీ శ్రేణులకు సూచించారు.

సీతాఫల్‌మండిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై బీజేపీ ఆకస్మిక తనిఖీలు
X

దిశ, సికింద్రాబాద్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా చూడాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్‌మండి డివిజన్‌లో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బూత్‌ల వద్ద ఓటర్లతో మాట్లాడి, బూత్ లెవల్ ఏజెంట్లు అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అభయ్ పాటిల్ మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయడంలో పార్టీ కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయడంతో పాటు, మరణించిన వారి పేర్లు, అనర్హ ఓట్లను తొలగించే ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి కావడానికి పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక్ రెడ్డి, కనకట్ల హరి, నాగేశ్వర్ రెడ్డి, అంబాల రాజేశ్వరరావు, ఈవి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story