అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా భద్రాద్రి అభివృద్ధి

by Ratna Kumari |

భద్రాచలాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా భద్రాద్రి అభివృద్ధి
X

దిశ, భద్రాచలం : భద్రాచలాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న పునరుద్ధరణ, అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, దేవస్థానం ఈవో దామోదర్ రావు తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు పనుల పురోగతిని మ్యాప్‌ల ద్వారా మంత్రికి వివరించారు. ఆలయ పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.351 కోట్లు, భూసేకరణకు రూ.75 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు.

వచ్చే గోదావరి పుష్కరాల నాటికి అన్ని పనులను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆలయ గోపురాలు, పురాతన నిర్మాణాల వైభవానికి భంగం కలగకుండా ఆగమశాస్త్రాలకు అనుగుణంగా పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని చెప్పారు. పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త స్నాన ఘాట్లు, యాత్రికుల సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పునరుద్ధరణ పనుల కారణంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత వంటి సౌకర్యాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆలయ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణ కోసం ఇంజినీరింగ్ శాఖ నుంచి ప్రత్యేక అధికారిని వెంటనే నియమించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫోన్ ద్వారా ఆదేశించారు. అలాగే ప్రతి పది రోజులకు ఒకసారి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆర్కిటెక్ట్ మూర్తి, ఇంజినీరింగ్ అధికారులు, దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story