గ్రామీణ యువతకు స్ఫూర్తిగా డా.చేతరాజుపల్లి వీరేందర్

by Jakkula.Mamatha |

పేదరికం చదువుకు అడ్డు కాదు.. లక్ష్యం, కృషి, పట్టుదల ఉంటే గ్రామం నుంచి ఐఐటీ వరకు చేరుకోవచ్చని డా.చేతరాజుపల్లి వీరేందర్ నిరూపించారు.

గ్రామీణ యువతకు స్ఫూర్తిగా డా.చేతరాజుపల్లి వీరేందర్
X

దిశ, ఖమ్మం రూరల్: "పేదరికం చదువుకు అడ్డు కాదు.. లక్ష్యం, కృషి, పట్టుదల ఉంటే గ్రామం నుంచి ఐఐటీ వరకు చేరుకోవచ్చని డా.చేతరాజుపల్లి వీరేందర్ నిరూపించారు. ఆయన విజయగాథ గ్రామీణ యువతకు మార్గదర్శకంగా, ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలనే ఆత్మవిశ్వాసాన్ని నింపే స్ఫూర్తిగా నిలుస్తోంది." ఖమ్మం జిల్లా ఏదులాపురం గ్రామానికి చెందిన డా. చేతరాజుపల్లి వీరేందర్ భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ హైదరాబాద్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డాక్టరేట్(పీహెచ్‌డీ) పట్టా సాధించి జిల్లా ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో చాటారు. జూలై 18న నిర్వహించిన ఐఐటీ హైదరాబాద్ స్నాతకోత్సవంలో ఆయనకు డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు.

డా. వీరేందర్ తల్లిదండ్రులు చేతరాజుపల్లి యాదగిరి, నాగమణి. స్వస్థలం మహబూబాబాద్ జిల్లా కాంపల్లి గ్రామమైనప్పటికీ, కుటుంబం అనంతరం ఖమ్మం జిల్లా ఏదులాపురంలో స్థిరపడింది.చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన వీరేందర్ కాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో 600 మార్కులకు 550 మార్కులు సాధించి మండల ప్రథమ స్థానం దక్కించుకున్నారు. అనంతరం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ) – ఐఐఐటీ ఆర్‌కే వ్యాలీలో ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం పొందారు. తర్వాత గేట్ పరీక్షలో అర్హత సాధించి వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆర్థిక ఇబ్బందులు, గ్రామీణ నేపథ్యం, సరైన మార్గదర్శకత్వం లేకపోయినా కష్టపడి చదువుకుంటూ తన లక్ష్యాన్ని చేరుకున్నారు. ఉన్నత విద్యపై ఆసక్తితో ఐఐటీ హైదరాబాద్‌లో ప్రొఫెసర్ ఎస్. సూర్య ప్రకాష్ పర్యవేక్షణలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

తక్కువ బరువుతో అధిక సామర్థ్యం కలిగిన ప్రీకాస్ట్ కాంక్రీట్ నిర్మాణ వ్యవస్థలపై చేసిన పరిశోధనకు శాస్త్రీయ వర్గాల ప్రశంసలు లభించాయి.ప్రస్తుతం చెన్నైలోని మాడ్యులస్ హౌసింగ్ సంస్థలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తూ ఆధునిక నిర్మాణ సాంకేతికతలు, నూతన నిర్మాణ పదార్థాల అభివృద్ధి పై పరిశోధనలు కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా డా. వీరేందర్ మాట్లాడుతూ, "ఈ విజయం నా తల్లిదండ్రులు, గురువులు, కుటుంబ సభ్యులు, నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి అంకితం. గ్రామీణ విద్యార్థులు పరిస్థితులను చూసి వెనుకడుగు వేయకుండా లక్ష్యంపై దృష్టి పెట్టి కష్టపడితే ప్రపంచంలోని అత్యున్నత విద్యాసంస్థల్లోనూ విజయాలు సాధించగలరు" అని అన్నారు. డా. చేతరాజుపల్లి వీరేందర్ సాధించిన ఈ ఘనత పై ఏదులాపురం గ్రామస్థులు, బంధుమిత్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. పేదరికం విజయానికి అడ్డంకి కాదని, కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఆయన విజయగాథ గ్రామీణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు.

Next Story