కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కొత్త బాధ్యతలు!

by Malleboina Mahesh |   (  Updated:2026-01-08 04:23:12  IST  )

క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమర్థులైన నేతలకు అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది.

కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కొత్త బాధ్యతలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమర్థులైన నేతలకు అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఆయా విభాగాల బాధ్యతలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించడం వల్ల అటు కార్యకర్తలు, ఇటు ప్రభుత్వం మధ్య సమన్వయం సాధించడం సులువు అవుతుందని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఎస్సీ సెల్ చైర్మన్ గా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎస్టీ సెల్ చైర్మన్ గా నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను నియమించింది. బీసీ సెల్ చైర్మన్ గా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేరును త్వరలో ప్రకటించే అవకాశముంది.

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పర్ణికా రెడ్డి?

నారాయణ పేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డిని మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నియమించేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలుపడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మహిళా కాంగ్రెస్ బాధ్యతలు యువతకు అప్పగించడం వల్ల ఆ ఏజ్ గ్రూప్ లో పార్టీని బలోపేతం చేయడం, ఆ జనరేషన్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం సులువు అవుతుందని ఏఐసీసీ భావిస్తున్నది. అలాగే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో యంగ్ ఉమెన్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అందుకు దీటుగా కాంగ్రెస్ మహిళా విభాగంలో యువతను ప్రోత్సహించేందుకు యువ ఎమ్మెల్యేగా ఉన్న పర్ణికారెడ్డి పేరును మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఖరారు చేసినట్లు తెలిసింది.

సరితా యాదవ్ కు జడ్పీ చైర్మన్ లేదా ఎమ్మెల్సీ పదవి

గద్వాల నియోజకవర్గం పార్టీ ఇన్ చార్జిగా ఉన్న సరితా యాదవ్ ను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించాలని ముందుగా భావించారు. కానీ ఆ పదవి చేపట్టడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో ఆమెను జిల్లా పరిషత్ చైర్మన్ లేదా ఎమ్మెల్సీగా నియమించే అవకాశం ఉందని సరితా యాదవ్ సన్నిహితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి సరితా ఓడిపోయారు. కానీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో అక్కడ వర్గపోరు మొదలైంది. దీంతో సరితకు ప్రయారిటీ ఉన్న పదవి ఇచ్చి సంతృప్తి పర్చాలని పార్టీ భావిస్తోంది.

Read More..

నేడు కాంగ్రెస్ కీలక సమావేశం.. మున్సిపోల్స్ పై ప్రధాన చర్చ

Next Story