నేడు కాంగ్రెస్ కీలక సమావేశం.. మున్సిపోల్స్ పై ప్రధాన చర్చ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-08 04:22:27  IST  )

రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలను నిర్వహిస్తున్నది.

నేడు కాంగ్రెస్ కీలక సమావేశం.. మున్సిపోల్స్ పై ప్రధాన చర్చ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలను నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే గురువారం టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని గాంధీభవన్​లో నిర్వహిస్తున్నది. టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ​మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ కీలక భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొననున్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో అమలుచేసే వ్యూహాలపై చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై తాజాగా రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్​చర్చించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్ స్థానాలను గణనీయ సంఖ్యలో గెలుచుకున్నా.. ప్రత్యర్థి బీఆర్ఎస్ కూడా సర్పంచ్ ఎన్నికల్లో ఆశించినదాని కంటే పనితీరును ఎక్కువగానే కనబరిచింది. దీంతో అధికారపార్టీ అలర్ట్ అయింది. మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి అవకాశాలను ప్రత్యర్థి పార్టీలకు ఇవ్వకుండా అన్ని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తు్న్నది. ప్రతివార్డు, డివిజన్ నుంచి ఆరుగురు చొప్పున అభ్యర్థుల జాబితాను రూపొందించి వారిలో సమర్థులైన కోసం సర్వే నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చిన తీరుపైనా చర్చించే అవకాశం ఉందని పార్టీవర్గాలు తెలిపాయి.

విపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా..

మరోవైపు కృష్ణా, గోదావరి జలాలపైన విపక్షాల ఆరోపణలు, విమర్శలు తిప్పికొట్టేలా కార్యాచరణ తీసుకుంటారని, అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా ఇచ్చిన అంశాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేలా కార్యాచరణ ఉంటుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మరోపైపు డీసీసీల కూర్పు అంశం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 15న మండలాధ్యక్షుల నియామకాన్ని చేపట్టనున్నారు.

Read More..

కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కొత్త బాధ్యతలు!

Next Story