రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-08 04:28:55  IST  )

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మున్సిపాలిటీలు, వార్డుల సంఖ్య తక్కువగానే ఉండటంతో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది, పోలీసులు ఉన్నారని ఈసీ గుర్తించింది. ఒకే విడతలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించినట్టు సమాచారం. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని జిల్లా యంత్రాంగం సైతం ఓకే చెప్పినట్టు తెలిసింది. ఒక రోజు ఎన్నికలు, మరునాడు ఓట్ల లెక్కింపు చేయనున్నారు.ఈ క్రమంలోనే ప్రతి పోలింగ్​స్టేషన్‌లో వెబ్‌కాస్టింగ్​ నిర్వహించాలని ఈసీ యోచిస్తున్నది. రాష్ట్రంలోని పోలింగ్​కేంద్రాలపై ఇంకా స్పష్టత రాలేదు.

ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్‌లకు ఒకేసారి బ్యాలెట్​ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల్లో అధికారులు బ్యాలెట్​బాక్సులను సిద్ధం చేయగా.. జిల్లాలో మున్సిపాలిటీలు, వార్డుల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్​బాక్సులను అందుబాటులో ఉంచారు. పోలింగ్ స్టేషన్‌ల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్​బాక్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పార్టీల పరంగా ఎన్నికలు కావడంతో పార్టీల గుర్తులను బ్యాలెట్​పేపర్‌పై ముందుగా ముద్రిస్తారు. ఆ తర్వాత ఇండిపెండెంట్​అభ్యర్థుల పేర్లను పొందుపరుస్తారు. నోటా గుర్తు సైతం ఈసారి బ్యాలెట్​పేపర్ మీద ముద్రించనున్నారు. ప్రతి జిల్లాలో తక్కువ సంఖ్యలో మున్సిపాలిటీలు ఉన్నందున.. తక్కువ సంఖ్యలోనే పోలింగ్, పోలీసు సిబ్బంది అవసరం అవుతారని అంచనాకు వచ్చిన జిల్లా యంత్రాంగం.. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్..

మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను పకడ్భందీగా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​రాణికుముదిని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాణి కుముదిని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సాధారణ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ, ఇతర సంబంధిత అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ.. తెలంగాణ మున్సిపాలిటీ చట్టంలో సవరించిన సెక్షన్ 195-ఏ ప్రకారం జనవరి 12న వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలని, 13న పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితాను టి-పోల్‌లో అప్‌లోడ్ చేయాలని, 16న ఫోటోతో కూడిన తుది ఓటర్ల జాబితాను పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని అధికారులను ఆదేశించారు.

పోలింగ్ నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సుల అంచనాను ముందస్తు తయారీతో పాటు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీల నియామకాలను సమయానికి పూర్తిచేయాలన్నారు. పోలింగ్ సిబ్బంది నియామకానికి అవసరమైన ఉద్యోగుల వివరాలను టి-పోల్‌లో అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాను వార్డుల వారీగా పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. అక్టోబర్ 1, 2025 నాటి ఓటర్ జాబితా ఆధారంగా ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని, ప్రతి ఓటర్‌ను వారి నివాస భౌగోళిక పరిధి, ఇంటి నంబర్, వార్డు సరిహద్దుల ఆధారంగా సంబంధిత వార్డులోనే లిస్టింగ్ చేయాలన్నారు.

ఒక వార్డులో ఉండే వ్యక్తికి మరో వార్డులో నమోదైన ఓట్లను గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రెండుచోట్ల నమోదైన ఓట్లకు ప్రత్యేకంగా మ్యాపింగ్ చేయాలని, ప్రతి మున్సిపాలిటీలో నామినేషన్, పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో వెబ్‌కాస్టింగ్ నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలన్నారు.

Read More..

నేడు కాంగ్రెస్ కీలక సమావేశం.. మున్సిపోల్స్ పై ప్రధాన చర్చ

Next Story