మున్సిపల్ కార్మికులకు వారసత్వ ఉద్యోగాలివ్వాలి : సీఐటీయూ 24 గంటల దీక్ష సక్సెస్

by Naga Rani Yarlagadda |

వయస్సు పైబడి పని చేయలేని స్థితిలో ఉన్న, అనారోగ్యంపాలైన, మరణించిన మున్సిపల్ కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని ఉద్యోగాలివ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు.

మున్సిపల్ కార్మికులకు వారసత్వ ఉద్యోగాలివ్వాలి : సీఐటీయూ 24 గంటల దీక్ష సక్సెస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వయస్సు పైబడి పని చేయలేని స్థితిలో ఉన్న, అనారోగ్యంపాలైన, మరణించిన మున్సిపల్ కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని ఉద్యోగాలివ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. వయస్సు పైబడి పని చేయలేని స్థితిలో ఉన్న, అనారోగ్యంపాలై, మరణించిన మున్సిపల్ కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ (సీడీఎంఏ) హెడ్ ఆఫీసు వద్ద 24 గంటల దీక్ష యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం. శ్రావణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ దీక్షను సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తో పాటు యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ పి. సుధాకర్, గుర్రం అశోక్, జన్ను ప్రకాష్, ఎ.వెంకటేష్, ఎస్. వెంకటస్వామి, ఎర్రా నర్సింహులు, అగ్గిమల్ల స్వామి, మహేష్ లకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షనుద్దేశించి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 64 వేల మంది మున్సిపల్ కార్మికులు వివిధ కేటగిరీలలో పనిచేస్తున్నారని, ప్రాణాంతకమైన అంటువ్యాదుల నుండి ప్రజలను కాపాడుతూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మున్సిపల్ కార్మికులు ప్రజలకు సేవలందిస్తున్నారని, ప్రజల ఆరోగ్యం పైన రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో వారసులకు పని కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల వారసులకు పని కల్పించకపోవడం అన్యాయమన్నారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత నెల రోజులుగా మున్సిపల్ కార్మికుల స్థానంలో వారి వారసులకు పని కల్పించాలని ఆందోళన - పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినందున ఈ దీక్షను ప్రారంభించామని, రాష్ట్రవ్యాప్తంగా అనేక కారణాలరీత్యా ప్రమాదాలకు గురై, అనారోగ్యంపాలైన వారు ఉన్నారని, ప్రమాదంలో మరణించిన కుటుంబ పెద్ద చనిపోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, పిల్లలు అనాధలుగా మారుతున్నారని, పారిశుద్ధ్య పనే జీవనాధారంగా బతుకుతున్న కార్మికుల కుటుంబ సభ్యులు మేము ఈ పనినే చేసుకుంటామని అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం పని కల్పించకుండా నిరాకరించడం సరైనది కాదన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ. రమ మున్సిపల్ మహిళా నాయకులకు పూలమాల వేసి ఈ దీక్షకు మద్దతు తెలిపి, వారు మాట్లాడుతూ నిత్యం మురికి మళినాలతో కూడిన పారిశద్ధ్యం, డ్రైనేజ్ తదితర ప్రమాదకరమైన పనులు చేస్తున్నారని, పని చేస్తున్న సమయంలో కార్మికులకు ప్రభుత్వం కనీస రక్షణ సదుపాయాలు కల్పించకపోవడంతో అనేకమంది వ్యాధుల బారిన పడి చనిపోతున్నారని, రోజుకు 10-12 గంటల పాటు పనిచేయడం వలన సరైన తిండి, విశ్రాంతి లేక ఆనారోగ్యానికి గురై కొంత మంది చనిపోయారని, అటువంటి కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని, వారి వారసులకు పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, పుప్పాల శ్రీకాంత్, బి. మధులు మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు దశరథ్, మల్లేష్లు మద్దతు తెలిపారు.

అధికారులతో చర్చలు.. దీక్ష విరమణ

దీక్షల సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకత్వంతో అధికారులు చర్చలు జరిపారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ దీక్ష వద్దకు వచ్చి సీఐటీయూ మున్సిపల్ యూనియన్ డిమాండ్ల పైన ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ప్రధాన సమస్యగా ఉన్న మున్సిపల్ కార్మికుల వారసులకు పని కల్పించడానికి ప్రభుత్వానికి, ఆర్థిక శాఖకు పంపుతున్నామని రాతపూర్వకంగా లేఖ ఇచ్చారు. పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ తక్షణమే ఉత్తర్వుల జారీకి సిఫార్సులు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారని తెలిపారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న మాట్లాడి దీక్షను విరమిస్తున్నట్లుగా ప్రకటించారు.

Next Story