- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిర్యాదులున్నా చర్యలేవీ?.. అక్రమ క్రషర్‌పై గనుల శాఖ మౌనం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామంలో కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రషర్ వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది.

దిశ, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామంలో కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రషర్ వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా, ఆందోళనలు నిర్వహించినా సంబంధిత శాఖలు ఇప్పటివరకు కఠిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. దుమ్ము, ధూళి, శబ్ద కాలుష్యంతో పంటలు దెబ్బతింటున్నాయని, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడం వెనుక అసలు కారణమేంటన్న చర్చ గ్రామంలో సాగుతోంది.
నోటీసులు జారీకే పరిమితం..
గ్రామస్తుల కథనం ప్రకారం, పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు ఫిర్యాదులు చేసినా నోటీసులు జారీ చేయడానికే పరిమితమయ్యారని, గ్రామస్తులు ఆందోళన చేపట్టిన తర్వాత కొద్దిరోజులు క్రషర్ నిలిపివేసి, అనంతరం మళ్లీ యథావిధిగా ప్రారంభించారని ఆరోపిస్తున్నారు. గతంలో ప్రాజెక్టు పనులకు సంబంధించిన రాళ్లను క్రషర్ అవసరాలకు వినియోగిస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. పేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం మట్టి తీసుకొచ్చినా అభ్యంతరం చెప్పే అధికారులు, ఈ వ్యవహారంలో మాత్రం ఎందుకు మౌనం పాటిస్తున్నారో అర్థం కావడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
అధికారిక లేఖతో కొత్త సందేహాలు..
ప్రజావాణిలో ఫిర్యాదు అందడంతో జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి 26-07-2025 తేదీతో గ్రామస్తులకు ఇచ్చిన అధికారిక లేఖలో, విచారణ సమయంలో క్రషర్ కార్యకలాపాలు జరగడం లేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో క్రషర్ ప్రారంభిస్తే సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం అదే ప్రాంతంలో క్రషర్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తుండటంతో, అప్పటి అధికారిక లేఖలో పేర్కొన్న అంశాలు, ప్రస్తుత పరిస్థితి మధ్య వ్యత్యాసం ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు గ్రామస్తులు లేవనెత్తుతున్నారు.
అధికారుల మాటల్లో విరుద్ధతలేనా..?
గతంలో ‘క్రషర్ పనిచేయడం లేదు’ అని అధికారికంగా లేఖ ఇచ్చిన గనుల శాఖ అధికారులు, ప్రస్తుతం క్రషర్ గురించి పూర్తి సమాచారం లేదని, అక్కడి నుంచి రైల్వే పనులకు సరఫరా జరుగుతోందని చెప్పినట్లు సమాచారం. దీంతో అధికారుల వ్యాఖ్యలపై గ్రామస్తుల్లో అనుమానాలు మరింత పెరిగాయి. రైల్వే శాఖ ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ పనులు కాంట్రాక్టర్ల ద్వారా నిర్వహిస్తారు. అలాంటప్పుడు ముడి సరుకు నేరుగా రైల్వే శాఖకు వెళ్తోందా? లేక కాంట్రాక్టర్లకు సరఫరా అవుతోందా? అందుకు అవసరమైన గనుల, పర్యావరణ, కాలుష్య నియంత్రణ అనుమతులు ఉన్నాయా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఓవర్‌లోడ్ టిప్పర్లతో గతంలోనే ఒకరు మృతి..
ఈ క్రషర్‌కు సంబంధించిన టిప్పర్ల రాకపోకలపై గతంలోనూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఓవర్‌లోడ్‌తో అతివేగంగా వెళ్తున్న టిప్పర్ ఢీకొనడంతో ఓ వాహనదారుడు మృతి చెందిన ఘటన జరిగినప్పటికీ టిప్పర్ల వేగం, ఓవర్‌లోడింగ్‌పై కఠిన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ భారీ టిప్పర్లు గ్రామ రహదారులపై తిరుగుతున్నాయని, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని చెబుతున్నారు.
ఫిర్యాదులు చేసిన విచారణ లేదు..!
క్రషర్ కార్యకలాపాలను గ్రామస్తులు పలుమార్లు అడ్డుకుని ఆందోళనలు చేపట్టినా, గనుల శాఖ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి సమగ్ర విచారణ నిర్వహించలేదని ఆరోపిస్తున్నారు. ప్రజలు పదేపదే ఫిర్యాదులు చేస్తున్నా స్పందించకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు.
అవినీతి అనుమానాల్లో గనుల శాఖ అధికారి..?
క్రషర్ వ్యవహారంలో జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి వ్యవహార శైలిపై గ్రామస్తులు అవినీతి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో క్రషర్ పనిచేయడం లేదని అధికారికంగా లేఖ ఇవ్వడం, ప్రస్తుతం అదే క్రషర్‌పై భిన్నమైన వ్యాఖ్యలు చేయడం, పలుమార్లు ఫిర్యాదులు చేసినా కఠిన చర్యలు తీసుకోకపోవడం వంటి పరిణామాలు పలు సందేహాలకు తావిస్తున్నాయని వారు చెబుతున్నారు.‘ఈ వ్యవహారం వెనుక అవినీతి జరిగిందా..? పలుకుబడి ఉన్నవారిని కాపాడుతున్నారా..? ముడుపుల కారణంగానే చర్యలు తీసుకోవడం లేదా..?’ అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ అనుమానాలపై ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
సమగ్ర విచారణే పరిష్కారం..
తిప్పాపూర్ క్రషర్ వ్యవహారంపై గనుల శాఖ, నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా విచారణ చేపట్టి క్రషర్‌కు సంబంధించిన అన్ని అనుమతులు, లీజు వివరాలు, పర్యావరణ అనుమతులు, రవాణా అనుమతులను బహిర్గతం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని, ప్రజల ప్రాణాలు, పర్యావరణాన్ని పరిరక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.






