ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు హెల్త్ కార్డుల పంపిణీ: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

by Kodari Anjali |

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు హెల్త్ కార్డుల పంపిణీ: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
X

దిశ, జగిత్యాల టౌన్: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పెన్షనర్లకు నూతన హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఆరోగ్య కార్డులు అందజేయడం పట్ల పెన్షనర్స్ యూనియన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉద్యోగుల పీఆర్సీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇటీవల రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు రూ.1,000 కోట్లు, రైతు భరోసా కింద రూ.9,000 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ ఆర్థిక భారం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. యూఐడీఎఫ్ నిధులు రూ. 62 కోట్లతో జగిత్యాలలో మౌలిక వసతుల కల్పనకు, యువత కోసం అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్, రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే జిల్లా కేంద్రంలో పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, మున్సిపల్ కౌన్సిలర్లు బోలుశాని శ్రీనివాస్, కుతురు శేఖర్, కో-ఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, పెన్షనర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మరియు పెద్ద సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు.

Next Story