తెలంగాణలో కమలం వికసింపజేద్దాం.. ఎక్స్-సర్వీస్‌మెన్‌కు బీజేపీ రాంచందర్ రావు పిలుపు

by Ramesh Naini |

గత 12 ఏండ్ల ప్రధాని మోడీ పాలనలో రక్షణ రంగ ఎగుమతులు రూ. 38,400 కోట్లకు పెరగడంతో భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు.

తెలంగాణలో కమలం వికసింపజేద్దాం.. ఎక్స్-సర్వీస్‌మెన్‌కు బీజేపీ రాంచందర్ రావు పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత 12 ఏండ్ల ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో రక్షణ రంగ ఎగుమతులు రూ. 38,400 కోట్లకు పెరగడంతో భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రాష్ట్ర ఎక్స్-సర్వీస్‌మెన్ సెల్ ప్రతినిధుల సమావేశంలో ఆయన రాంచందర్ రావు మాట్లాడారు. సరిహద్దుల్లో దేశాన్ని రక్షించిన మాజీ సైనికులు, రిటైర్మెంట్ తర్వాత సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలపై పోరాడాలని, సైనిక క్రమశిక్షణతో పనిచేసి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో తొలిసారిగా ఎక్స్-సర్వీస్‌మెన్ సెల్ ప్రతి జిల్లా నుంచి కన్వీనర్లతో బలమైన టీమ్‌లను ఏర్పాటు చేసుకుని, పార్టీలో అత్యంత క్రియాశీలక వింగ్‌గా రూపుదిద్దుకోవడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. న్యాయవాదులకు లీగల్ సెల్, కార్మికులకు లేబర్ సెల్ ఎలాగైతే పనిచేస్తాయో, ఎక్స్-సర్వీస్‌మెన్ సెల్ కూడా దేశ సరిహద్దుల్లో సేవలు అందించిన సైనికులకు అండగా ఉంటుందని అన్నారు. కలెక్టరేట్లలో ఉండే రిటైర్డ్ ఎంప్లాయిస్ బోర్డులు సక్రమంగా పనిచేసేలా చూడడంతో పాటు, మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి, దేశ సమస్యలపై స్పందించడానికి ఈ సెల్ చొరవ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

జూలై 26న 'కార్గిల్ విజయ్ దివస్'

రాబోయే జూలై 26న 'కార్గిల్ విజయ్ దివస్'ను రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించాలని రాంచందర్ రావు సూచించారు. క్లిష్టమైన కొండ ప్రాంతాల్లో శత్రువులను ఎదుర్కొని దేశమాతను రక్షించిన సైనికుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలో సాధించిన విజయాన్ని స్మరిస్తూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో పనిచేసే సైనికుల నిబద్ధతను గుర్తుచేస్తూ, వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ సిఫార్సుల కోసం వేసిన జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్‌ను బీఎస్ఎఫ్ సైనికులు కలిసినప్పుడు జరిగిన ఒక నిజ జీవిత సంఘటనను ఆయన పంచుకున్నారు. సరిహద్దుల్లో విపరీతమైన వేడిని తట్టుకోవడానికి తమ జీతాలు లేదా పెన్షన్ల పెంపును కోరకుండా, కేవలం రేషన్‌లో "అరకిలో ఉల్లిగడ్డలు" పెంచమని మాత్రమే వారు వేడుకున్నారని గుర్తుచేశారు. డబ్బులు, ప్రమోషన్లు కాకుండా దేశ సేవ, ఆరోగ్యాన్నే ప్రాధాన్యంగా భావించే సైనికుల త్యాగనిరతి మనందరికీ ఆదర్శనీయమని కొనియాడారు.

రూ.38,400కోట్లు ఎగుమతులు

ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారత్ ‘సురక్షిత భారత్’గా మారిందని, 'ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని రాంచందర్ రావు స్పష్టం చేశారు. 2014లో రూ. 686 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు నేడు రూ. 38,400 కోట్లకు పెరిగాయని, రక్షణ బడ్జెట్ రూ. 2.5 లక్షల కోట్ల నుంచి రూ. 8 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు. అలాగే రక్షణ ఉత్పత్తుల విలువ రూ. 46,000 కోట్ల నుంచి రూ. 1.50 లక్షల కోట్లకు పెరిగిందని, ఆర్డినెన్స్ నిల్వల స్వయం సమృద్ధి 32 శాతం నుంచి 90 శాతానికి చేరుకుందని తెలిపారు. నేవీ, కోస్ట్ గార్డ్ నౌకల్లో 97శాతం మేడ్ ఇన్ ఇండియా పరికరాలే ఉపయోగిస్తున్నామని, తేజస్ యుద్ధ విమానాలు, ఐఎన్ఎస్ విక్రాంత్ వంటివి భారత రక్షణ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఒకప్పుడు ఉగ్రవాదంపై ‘చర్చలు’ మాత్రమే ఉండేవి కానీ, ఇప్పుడు ‘చర్చలు లేవు - కేవలం చర్యలే’ అనే విధానంతో ఉరి సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా సత్తాచాటిన భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించిందన్నారు. సైన్యంలో ఉన్నప్పుడు యూనిఫామ్‌లో దేశాన్ని కాపాడిన సైనికులు, రిటైర్మెంట్ తర్వాత కూడా సమాజంలోని అవినీతి, అన్యాయాలపై పోరాడి దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. సైనిక క్రమశిక్షణతో పనిచేస్తూ అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

Next Story