"ప్రభుత్వ లాంఛనాలు అక్కర్లేదు" : ముద్రగడ ఫ్యామిలీ

by Muthe.Rajitha |   (  Updated:2026-07-15 08:50:55  IST  )

కాపు సామాజికవర్గ అగ్రనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు.

ప్రభుత్వ లాంఛనాలు అక్కర్లేదు : ముద్రగడ ఫ్యామిలీ
X

దిశ, వెబ్ డెస్క్ : కాపు సామాజికవర్గ అగ్రనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలన్న ప్రతిపాదనను ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముద్రగడ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని తుది వీడ్కోలు నిమిత్తం కాకినాడ జిల్లాలోని ఆయన స్వస్థలమైన కిర్లంపూడికి తరలించారు. అయితే ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ గౌరవ సూచికంగా అధికారిక లాంఛనాలతో జరుపుతామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆయన కుటుంబం దీనికి నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నాయకుడు జక్కంపూడి రాజా మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. ముద్రగడ పద్మనాభం బతికి ఉన్నంత కాలం రాజకీయంగా, వ్యక్తిగతంగా అనేక రకాలుగా వేధింపులకు గురిచేసి, అవమానించిన వారు.. ఇప్పుడు ఆయన మరణించాక లేని సానుభూతిని ప్రదర్శిస్తూ అధికారిక లాంఛనాలు అనడం తమకు ఎంతమాత్రం అవసరం లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేసినట్లు రాజా పేర్కొన్నారు. ముద్రగడ తన జీవితంలో ఎన్నడూ పదవుల కోసమో, తాత్కాలిక గొప్పల కోసమో పాకులాడలేదని, ప్రజా పక్షాన పోరాడిన నిఖార్సైన నేతగా నిలిచారని ఆయన కొనియాడారు.

కూతురుకు దక్కని కడచూపు

ఇదిలావుండగా కన్నతండ్రిని కడసారి చూసుకునేందుకు హైదరాబాద్ నుండి కిర్లంపూడికి తరలివచ్చిన ముద్రగడ కుమార్తె క్రాంతిశీలను ఆమె తల్లితో పాటు అక్కడ ఉన్న ముద్రగడ అభిమానులు, అనుచరులు తీవ్రంగా ప్రతిఘటించారు. గతంలో తండ్రితో వచ్చిన విభేదాలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్న కుటుంబ సభ్యులు ఆమెను అంత్యక్రియల ప్రాంగణంలోకి రాకుండా, భౌతికకాయాన్ని చూడకుండా గేట్ల వద్దే అడ్డుకుని వెనక్కి పంపించివేశారు. దశాబ్దాల పాటు కాపు రిజర్వేషన్ల పోరాటమే ఊపిరిగా బతికిన ఒక శకం ముగియడంతో కిర్లంపూడి పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు కేవలం సాంప్రదాయబద్ధంగా, వ్యక్తిగత పద్ధతిలోనే ఆయన అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కిర్లంపూడిలో ఉద్రిక్తత.. ముద్రగడ కూతురిని రానివ్వని భార్య, అభిమానులు

Next Story