కిర్లంపూడిలో ఉద్రిక్తత.. ముద్రగడ కూతురిని రానివ్వని భార్య, అభిమానులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-15 02:50:59  IST  )

కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూతురిని కడసారి చూపుకు రానివ్వొద్దని ముద్రగడ భార్య డిమాండ్ చేయడంతో అభిమానులు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కిర్లంపూడిలో ఉద్రిక్తత.. ముద్రగడ కూతురిని రానివ్వని భార్య, అభిమానులు
X

దిశ, వెబ్‌డెస్క్: కాపు ఉద్యమనేత, ప్రముఖ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభరెడ్డి మరణంతో.. తెలుగు రాజకీయాల్లో తీరని విషాదం అలుముకుంది. మరోవైపు తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన కూతురు క్రాంతి శీలను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కిర్లంపూడి రావడానికి వీల్లేదని కుటుంబ సభ్యులు సూచించడంతో.. ప్రత్తిపాడు వద్దే క్రాంతి కార్లను నిలిపివేశారు. చాలాసేపటి తర్వాత తండ్రి చివరిచూపుకోసం అనుమతించగా.. ఆమె వెనుకే పోలీసులు మఫ్టీలో ఫాలో అయ్యారు. ఎట్టకేలకు క్రాంతి కిర్లంపూడికి చేరుకోగా.. ఆమెను లోపలికి రానివ్వొద్దని, బయటే ఆపివేయాలని ముద్రగడ పద్మనాభం భార్య, క్రాంతి తల్లి వాపోయారు. దీంతో ముద్ర అనుచరులు, అభిమానులు క్రాంతిని అడ్డుకున్నారు. తాను చనిపోయాక చివరి చూపుకు కూడా కూతురు క్రాంతి రావొద్దని గతంలో ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన కోరిక మేరకు క్రాంతిని వెనక్కి పంపించివేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆమెదంతా కొంగజపం అని విమర్శలు చేశారు. పోలీసుల భద్రత నడుమ తండ్రి కడసారి చూపుకోసం అతి కష్టంగా ఇంటి వద్దకు చేరుకోగా.. రెండునిమిషాలైనా తండ్రిని చూడనివ్వకపోవడంతో.. నాన్న.. నాన్న అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కనీసం ముద్రగడ భౌతిక కాయాన్ని ఉంచిన ఫ్రీజర్ బాక్సును కూడా టచ్ చేయనివ్వకపోవడంతో.. ఆమె బాధ వర్ణనాతీతంగా మారింది. దీంతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులే ఆమెను మళ్లీ వెనక్కి తీసుకువెళ్లిపోయారు.

తండ్రికి వ్యతిరేకంగా.. జనసేన పార్టీలో చేరి పవన్ కల్యాణ్ కు క్రాంతి మద్దతు ఇవ్వడంతో.. తండ్రి - కూతుళ్ల బంధానికి బీటలు వచ్చాయి. పవన్ కాపుల నాయకుడిగా ఉన్నారంటూ.. ఎన్నికల సమయంలో తునిలో నిర్వహిచిన పవన్ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆస్తుల విషయమై విభేదాలు వచ్చినట్లు వార్తలొచ్చాయి. తన తండ్రి ముద్రగడ పద్మనాభం, సోదరుడు గిరిల వల్ల తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందంటూ క్రాంతి శీల గతంలో బహిరంగంగా ఆరోపణలు చేశారు. తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆమె పోలీసులను కూడా ఆశ్రయించారు. ఈ వివాదాల వెనుక ఆస్తి గొడవలు కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే, తాము తండ్రి ఆస్తిని ఏనాడూ ఆశించలేదని, కేవలం తమ వ్యక్తిగత జీవితానికి స్వేచ్ఛ కావాలని ఆమె పేర్కొన్నారు.

ఈ ఆరోపణలపై ముద్రగడ పద్మనాభం తీవ్రంగా కలత చెందారు. తన బిడ్డను తానేం అనలేదని, కొందరు రాజకీయ ప్రత్యర్థులు తనను దెబ్బతీయడానికి తన కూతురిని వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు చేసిన ఆరోపణల వల్ల నొచ్చుకున్న ఆయన.. తాను చనిపోయినా కూతురు రావడానికి వీల్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన కోరిక మేరకే కూతురిని కడసారి తనివితీరా చూసుకునేందుకు తల్లి అంగీకరించడంలేదు.

Next Story