అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ఆగ్రహం

by Malleboina Mahesh |   (  Updated:2026-03-29 08:54:47  IST  )

అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ఫైర్. కడియం శ్రీహరికి మర్యాద ఇవ్వరా? అంటూ ప్రశ్న. వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్.

అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అక్రమాలపై హౌస్ కమిటీ (House Committee) అంశంపై సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) బిగ్గరగా అరుస్తూ.. ఇంతకీ ఏ పార్టీలో ఉన్నావ్ అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి నిప్పులు చెరిగారు. బడ్జెట్ డిమాండ్లపై అర్థవంతమైన చర్చ జరుగుతున్న సమయంలో, సభా సమయాన్ని వృధా చేస్తూ అల్లరి చేయడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తండ్రి లాంటి కడియం శ్రీహరి (Kadiyam Srihari) వంటి సీనియర్ నాయకులకు కనీస మర్యాద ఇవ్వకుండా మాట్లాడటం అప్రజాస్వామికమని ఆమె విమర్శించారు.

సభలో జరుగుతున్న పరిణామాలను నిన్నటి నుంచి గమనిస్తున్నానని, కొత్త ఎమ్మెల్యేలుగా తాము ఎంతో కొంత నేర్చుకుందామని వస్తే.. బీఆర్ఎస్ సభ్యుల తీరు తమను అయోమయానికి గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యుల అనుచిత ప్రవర్తన వల్ల తాము నేర్చుకున్నది కూడా మర్చిపోయే పరిస్థితి వస్తోందని యశస్వినీ రెడ్డి వ్యాఖ్యానించారు. సభను పక్కదారి పట్టిస్తున్న పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని, సభను స్పీకర్ ఆర్డర్‌లో పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. సభా సంప్రదాయాలను గౌరవించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి కోరారు.

అసెంబ్లీలో దుమారం.. పాడి కౌశిక్ రెడ్డికి పదవీ గండం?

Next Story