నిబంధనలకు పాతర.. 'సీల్' వేసిన భవనంలో ఆసుపత్రి ఏర్పాట్లు!

by Jakkula.Mamatha |

ఒకవైపు అధికారులు భవనానికి సీల్ వేసి, అది అక్రమ కట్టడమని బోర్డు తగిలిస్తే.. మరోవైపు అదే భవనంలో ఆసుపత్రి ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది.

నిబంధనలకు పాతర.. సీల్ వేసిన భవనంలో ఆసుపత్రి ఏర్పాట్లు!
X

దిశ, పేట్ బషీరాబాద్: ఒకవైపు అధికారులు భవనానికి సీల్ వేసి, అది అక్రమ కట్టడమని బోర్డు తగిలిస్తే.. మరోవైపు అదే భవనంలో ఆసుపత్రి ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని బ్యాంకు కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది.

అధికారుల నిర్లక్ష్యం?

గతంలోనే జీడిమెట్ల సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ భవనాన్ని అక్రమ కట్టడంగా గుర్తించి సీజ్ చేశారు. హెచ్‌ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 461-ఏ ప్రకారం భవనానికి సీల్ వేసినట్లు బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఆ సీల్ ఎందుకో తెలియదు కానీ, భవనంలో పనులు మాత్రం ఆగకుండా కొనసాగుతూ వచ్చాయి. ఈ విషయం టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసినప్పటికీ, వారు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

భద్రతా ప్రమాణాలు గాలికి..

ప్రస్తుతం సదరు సీజ్ చేసిన భవనంలో ఒక ఆసుపత్రిని ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఆసుపత్రికి ఉండాల్సిన కనీస నిబంధనలైన సెట్‌బ్యాక్స్, పార్కింగ్ సౌకర్యం, ఫైర్ సేఫ్టీ వంటివి ఏ మాత్రం లేకపోయినా, ప్రారంభోత్సవానికి ముస్తాబు చేస్తుండటం గమనార్హం. సీల్ వేసిన భవనంలో ఆసుపత్రిని ఎలా అనుమతిస్తారని, ఒకవేళ అనుమతులు లేకపోతే అధికారులు ఎలా మౌనంగా ఉంటున్నారని అక్కడివారు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సీజైన భవనంలో ఆసుపత్రి ప్రారంభానికి లేదా భవన నిర్మాణం పూర్తి చేయడానికి టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమైనా ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చారా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.

Next Story