పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలు

by Jakkula.Mamatha |

పిచ్చికుక్క స్వైర విహారం చేయడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలు
X

దిశ, కామారెడ్డి: పిచ్చికుక్క స్వైర విహారం చేయడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. బాధితులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలో నడుచుకుంటూ వెళుతున్న ఐదుగురు మహిళలపై పిచ్చికుక్క దాడి చేసి కరిచింది. దీంతో తల, తొడ, కాళ్లు, చేయి భాగాలలో తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో రాజవ్వ, తిరుపతమ్మ, మరో ముగ్గురు కాలనీకి చెందిన మహిళలు ఉన్నట్లు కాలనీవాసులు గుర్తించారు. కాలనీకి చెందిన తిరుపతమ్మ అనే మహిళ తన మనవడిని ఎత్తుకొని కిరాణా షాపుకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా తిరుపతమ్మ పైకి పిచ్చికుక్క రావడంతో తన దగ్గర ఉన్న మనవడిని కాపాడడం కోసం ఆమె శతవిధాల ప్రయత్నాలు చేసింది.

దీంతో పిచ్చికుక్క తిరుపతమ్మ పై దాడి చేయడంతో కింద పడిపోవడంతో తల, తొడ భాగాలలో తీవ్రంగా కుక్క కరిచింది. గమనించిన స్థానికులు పిచ్చికుక్కను తరిమికొట్టారు. అదేవిధంగా కాలనీలో నడుచుకుంటూ వెళుతున్న రాజవ్వ, మరో ఇద్దరు మహిళలు, స్కూటీపై వెళ్తున్న ఓ మహిళపై పిచ్చికుక్క దాడి చేసి కరిచింది. తీవ్రంగా గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు కాలనీవాసులు తరలించారు. గతంలో పిచ్చికుక్కల బారినుంచి రక్షణ కల్పించాలంటూ ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు అధికారులపై మండిపడ్డారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టించుకోని పిచ్చి కుక్కలను కాలనీ నుంచి తరిమి కొట్టాలంటూ కాలనీవాసులు డిమాండ్ చేశారు.

Next Story