ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్.. ఐదు రోజులైనా ప్రారంభంకాని పూడికతీత పనులు

by Jakkula.Mamatha |

మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్ కుడి ఎడమ కాల్వల పూడికతీత పనులపై అధికారులు ఇచ్చిన హామీలు నీటి మూటలా మారాయి.

ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్.. ఐదు రోజులైనా ప్రారంభంకాని పూడికతీత పనులు
X

దిశ, వైరా: మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్ కుడి ఎడమ కాల్వల పూడికతీత పనులపై అధికారులు ఇచ్చిన హామీలు నీటి మూటలా మారాయి. స్వయానా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ యుద్ధ ప్రాతిపదికన కాల్వల పూడికతీత పనులు ప్రారంభించాలని నీటిపారుదల శాఖ ఈఈని ఆదేశించిన కనీస ఫలితం లేకుండా పోయింది. ఈ ఆదేశాలు జారీ చేసి 5 రోజులు గడిచినప్పటికీ నీటిపారుదల శాఖ అధికారుల్లో కనీస చలనం కరువైంది. దీంతో ఎమ్మెల్యే, సుడా చైర్మన్ ఇచ్చిన హామీకు అనుగుణంగా ఈనెల 15వ తేదీన సాగునీటి విడుదల చేసే అంశంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నెల 3వ తేదీన వైరాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో సాగు నీటి విడుదలపై రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులు, ప్రజా ప్రతినిధులు కుడి ఎడమ కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టాలని కోరారు.

కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు చివరి గ్రామాల్లో కాలువల్లో పూడికతో పాటు పిచ్చి మొక్కలు పెరిగి అద్వానంగా తయారయ్యాయి. పూడికతీత పనులు చేపట్టకపోతే చివరి ఆయకట్టు భూములకు సాగునీరు సరఫరా అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. అయితే రైతులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ యుద్ధ ప్రాతిపదికన ఈ నెల 4వ తేదీ నుంచి కాలువల్లో పూడికతీత పనులు ప్రారంభించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన నిధులు తాను కేటాయిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వారం రోజుల్లో ఆ పనులు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ ఈఈ బాబురావును ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశించి ఐదు రోజులు గడిచినప్పటికీ నీటిపారుదల శాఖ అధికారులు నేటి వరకు పనులు ప్రారంభించలేదు. దీంతో ఈనెల 15వ తేదీన కాల్వలకు నీరు విడుదల చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఎమ్మెల్యే, సుడా చైర్మన్ ఆదేశాలనే నీటిపారుదల శాఖ అధికారులు ఖాతరు చేయడం లేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, సుడా చైర్మన్ స్పందించి వెంటనే కాల్వలకు మరమ్మతులు చేయించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

Next Story