- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుంగతుర్తిలో హైటెన్షన్.. కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. పోలీసు వాహనాలు ధ్వంసం
తుంగతుర్తి కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే సామేల్, ఎంపీ చామల వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అర్వపల్లిలో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడం కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఎమ్మెల్యే మందుల సామేల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదరరెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఇప్పుడు దాడుల వరకు చేరింది. తాజాగా అర్వపల్లిలో రోడ్డుపైనే ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. అయితే ఈ ఘర్షనలో పోలీసుల వాహనాలు సైతం ధ్వంసం అయ్యాయి.
చలో గాంధీ భవన్ అడ్డుకోవడంతో..
ఎమ్మెల్యే మందుల సామేల్ తీరుకు నిరసనగా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ చలో గాంధీభవన్ కు పిలుపునిచ్చారు. వారంతా గాంధీభవన్‍కు బయలుదేరుతుండగా ఎమ్మెల్యే వర్గం వారిని అడ్డుకుంది. దీంతో అక్కడ ఘర్షణ ఏర్పడినట్లు సమాచారం. అయితే గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఓర్చుకుని పార్టీని గెలిపిస్తే తీరా అధికారంలోకి వచ్చాక పదవులన్నీ వలస నేతలకు ఇస్తున్నారని తుంగతుర్తి కాంగ్రెస్‍లో పాత నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని కాపాడుతున్న క్యాడర్‍ను కాదని ఎమ్మెల్యే మందుల సామేల్ తన వెంట తెచ్చుకున్న నేతలకు పదవులు కట్టబెడుతున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పార్టీ ప్రకటించిన మండల అధ్యక్షుల నియామకాల విషయంలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పదవుల పంపకాల్లో మందుల సామేల్ ఏకపక్షంగా వ్యవహరిస్తుంన్నారంటూ క్యాడర్ రోడెక్కడం దుమారం రేపుతోంది.
టీ కాంగ్రెస్‍కు బిగ్ చాలెంజ్!:
కాంగ్రెస్ పార్టీలో పాత వర్సెస్ కొత్త నేతల వివాదం కేవలం తుంగతుర్తికి మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో ఈ వివాదం నివురుగప్పిన నిప్పులా ఉంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక మంది ఇతర పార్టీ నేతలు వలస వచ్చారు. పార్టీ, ప్రభుత్వ అవసరాల దృష్ట్యా వారిని ఓల్డ్ క్యాడర్ భరిస్తూ వచ్చినా తమపై కొత్త నేతల అజమాయిషీ పెరుగుతోందనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పదవుల పంపకాల్లోనూ తమకు అన్యాయం జరుగుతోందని ఈ విషయంలో ఇక సహించేది లేదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తుంగతుర్తిలో మొదలైన ఈ ఘర్షణను పార్టీ పెద్దలు సామరస్యపూర్వకంగా పరిష్కరించకుంటే ఇదే తరహా విభేదాలు మిగతా చోట్ల ఏర్పడే అవకాశం ఉందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరహా విభేదాలు పెరిగిపోతే అది అంతిమంగా ప్రత్యర్థుల చేతికి ఆయుధంగా మారే అవకాశం ఉందనే ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకోగా ఈ తరహా విభేదాలు ఇప్పుడు టీ కాంగ్రెస్ కు బిగ్ చాలెంజ్ గా మారుతున్నాయి. మరి ఈ విభేదాలకు పార్టీ పెద్దలు ఎలా చెక్ పెట్టబోతున్నారు అనేది వేచి చూడాలి.






