భద్రతా దళాల భారీ విజయం: లష్కరే టాప్ కమాండర్ జాకీర్ గనాయ్ హతం

by Kema Shiva Kumar |

జమ్మూ కశ్మీర్ షోపియాన్ జిల్లాలో భద్రతా దళాల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ జాకీర్ గనాయ్ హతమయ్యాడు.

భద్రతా దళాల భారీ విజయం: లష్కరే టాప్ కమాండర్ జాకీర్ గనాయ్ హతం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్‌ (Jammu Kashmir)లో మరో భారీ విజయం సాధించాయి. ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా షోపియాన్ జిల్లాలో గత 5 రోజులుగా కొనసాగుతున్న కౌంటర్ టెర్రరిజమ్ ఆపరేషన్‌లో లష్కరే తోయిబా (LeT) టాప్ కమాండర్ జాకీర్ గనాయ్ (Zakir Ganai) ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అధికారులు అతడి మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. జులై 3న స్థానిక తోటల ప్రాంతంలో అమర్చిన నిఘా కెమెరాల్లో జాకీర్ గనాయ్‌తో పాటు లతీఫ్ అనే మరో ఉగ్రవాది కదలికలు తొలిసారిగా రికార్డయ్యాయి. ఆ సమాచారంతో రంగంలోకి దిగిన భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ (CRPF) జాయింట్ ఆపరేషన్ చేపట్టి ఆ ప్రాతాన్ని మొత్తం బ్లాక్ చేశాయి.

ఐదో రోజుకు చేరిన ఆపరేషన్..

అయితే, నేటితో భారీ సెర్చ్ ఆపరేషన్ ఐదో రోజుకు చేరుకుంది. దట్టమైన తోటల గుండా ఉగ్రవాదులు తప్పించుకోకుండా ఉండేందుకు ఆర్మీకి చెందిన ప్రత్యేక విభాగానికి చెందిన విక్టర్ ఫోర్స్ (Victor Force) బయటకు వెళ్లే అన్ని మార్గాలను క్లోజ్ చేసింది. రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనిపించేలా స్పెషల్ లైటింగ్ ఏర్పాట్లు చేశారు. భద్రతా దళాలు ఉగ్రవాదులు ఉన్న చోటికి చేరుకుంటున్న తరుణంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లష్కరే టాప్ కమాండర్ జాకీర్ హతం కాగా, ప్రస్తుతం అక్కడ దాక్కున్న రెండో ఉగ్రవాది లతీఫ్ కోసం దళాలు తమ గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

Next Story