'బేబీ 2'పై అప్డేట్ ఇచ్చిన ఎస్‌కేఎన్

by Pulgam srinivas |

'బేబీ' సీక్వెల్‌పై ఎస్‌కేఎన్ క్లారిటీ ఇచ్చారు. తుది నిర్ణయం పూర్తిగా దర్శకుడు సాయి రాజేష్‌దేనని స్పష్టం చేశారు.

బేబీ 2పై అప్డేట్ ఇచ్చిన ఎస్‌కేఎన్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన వారిలో ఎస్‌కేఎన్ ఒకరు. తాజాగా ఆయన నిర్మించిన 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రంలో కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్‌కేఎన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా, "మీరు కొంతకాలం క్రితం నిర్మించిన 'బేబీ' సినిమా ఘన విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్ రూపొందించే ఆలోచన ఉందా?" అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.

దీనికి ఎస్‌కేఎన్ స్పందిస్తూ.. "'బేబీ' చిత్రానికి దర్శకత్వం వహించిన సాయి రాజేష్ వల్లే ఆ సినిమా అంతటి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆయనదే కీలక పాత్ర. సీక్వెల్ విషయంలో కూడా తుది నిర్ణయం పూర్తిగా సాయి రాజేష్‌దే. ఆయనకు సీక్వెల్ చేయాలనే ఆసక్తి ఉంటే తప్పకుండా చేస్తాం. లేదంటే చేయం. ప్రస్తుతం అయితే అలాంటి ఆలోచన ఏదీ లేదు" అని స్పష్టం చేశారు. కాగా కొంతకాలం క్రితం విడుదలైన 'బేబీ' చిత్రంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించగా, వైష్ణవి చైతన్య కథానాయికగా మెప్పించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి, భారీ వసూళ్లను రాబట్టింది.

Next Story