- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

దిశ, నాగర్ కర్నూల్ /తిమ్మాజిపేట/ బిజినపల్లి: ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఆయన నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట బస్టాండ్‌లో 11.5 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోను పట్టణాలకు దీటుగా రహదారులు, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తిమ్మాజిపేట బస్టాండ్‌కు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నందున సీసీ రోడ్డు నిర్మాణంతో దుమ్ము, బురద సమస్యలు తొలగిపోవడంతో పాటు ప్రయాణికులకు, వాహనదారులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. విద్యుత్ సరఫరాను మరింత బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఈ సబ్‌స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్(ఎస్‌ఈ), నాగర్‌కర్నూల్ ఆర్టీవో ఇ.అర్చన, విద్యుత్ శాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.






