Medaram Jatara 2026 : మహా జాతర ప్రారంభం.. దారులన్నీ మేడారం వైపే

by Malleboina Mahesh |   (  Updated:2026-01-28 10:15:19  IST  )

తెలంగాణ కుంభమేళా గా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర కి వేళ అయింది. రెండేళ్లకోసారి జరిగే ఈ గిరిజన జాతర నేటి నుంచి ప్రారంభం అవుతుంది.

Medaram Jatara 2026 : మహా జాతర ప్రారంభం.. దారులన్నీ మేడారం వైపే
X

దిశ, మేడారం న్యూస్ నెట్వర్క్: తెలంగాణ కుంభమేళా గా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర కి వేళ అయింది. రెండేళ్లకోసారి జరిగే ఈ గిరిజన జాతర ప్రారంభం అయింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి తమ కోరికలు తీర్చమని వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం జాతర కేవలం పండుగ కాదు.. గిరిజనుల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. మేడారంలో విగ్రహాలు ఉండవు గద్దెలే దేవతల నివాసాలు. గిరిజన సంప్రదాయాలే పూజలు. బెల్లం నైవేద్యం, కుంకుమ–పసుపు, కోళ్ల బలి, వెదురు గద్దెలు ఇవే ప్రత్యేకతలు. అడవుల్లో మొదలైన ఆరాధన నేడు దేశవ్యాప్తంగా గిరిజన సంస్కృతికి గుర్తింపుగా నిలిచింది.

మేడారం జాతర సందర్భంగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి పూజారులు సారలమ్మను, కొండాయి నుంచి గోవింద రాజు, పునుగొండ్ల నుంచి పగిడిద్ద రాజులను గద్దెలపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభం అవుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకు రావడంతో మొక్కులు మొదలవుతాయి. మేడారంలో జనవరి 30, 31న భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. నాలుగు రోజులపాటు జాతర నడిచి జనవరి 31 సాయంత్రం 6 గంటలకు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజులు వన ప్రవేశం తో జాతర ముగింపు కానుంది. అతిపెద్ద ఆదివాసీ జాతర–2026 ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు జరిగే జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేయడంతో ఒక మహా పరిపాలన కార్యాచరణగా రూపొందించారు.

కాగా, భక్తుల రాకపోకలు, భద్రత, మౌలిక వసతులు, వైద్య సేవలు, పరిశుభ్రత వంటి అంశాల్లో ఎక్కడా లోటు లేకుండా చూడాలనే లక్ష్యంతో మొత్తం 21 శాఖలను భాగస్వాములుగా చేశారు. జాతర ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లు, 42 సెక్టార్లుగా విభజించి ఏర్పాట్లు చేశారు. జాతరకు మొత్తం 42,027 మంది సిబ్బందిని విధులు నిర్వహించనున్నారు. జాతరకు వచ్చే వాహనాలకు పార్కింగ్ అవసరాల కోసం మొత్తం 42 ప్రదేశాల్లో 1,418 ఎకరాలల్లో ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించారు. జాతర కోసం టీజీఎస్‌ఆర్టీసీ ఈసారి మొత్తం 4,000 బస్సులు నడుపుతుండగా గత వారం రోజులుగా ఆర్టీసీ సర్వీసులు నడిపిస్తోంది.

READ MORE .....

Medaram: భక్తుల భద్రతే లక్ష్యం.. మంత్రి సీతక్క కీలక సూచనలు

Next Story